కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని... పరువు నష్టం కేసులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా తనపై నమోదైన పరువు నష్టం కేసుల్లో... విచారణకు ఆయన హాజరుకావాల్సి ఉంటుంది.
గురువారం ముంబయి కోర్టు ముందు హాజరయ్యారు రాహుల్. పాత్రికేయురాలు గౌరీలంకేష్ హత్య సమయంలో... రాహుల్ భాజపా-ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలపై విమర్శలు గుప్పించారు. దీనిపై సంఘ్ కార్యకర్త, న్యాయవాది జోషి పరువునష్టం కేసు వేశారు.
కోర్టు విచారణకు హాజరైన రాహుల్ తాను ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు. ఆయన వాదనలు విన్న న్యాయస్థానం రూ.15వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 22కు వాయిదా వేసింది. విచారణ సమయంలో రాహుల్ హాజరుపై మినహాయింపు నిచ్చింది.
థానేలో...
మహాత్మా గాంధీ హత్యకు ఆర్ఎస్ఎస్ కారణమంటూ రాహుల్‌గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. థానే జిల్లాలోని బివాండీలో ఓ స్థానిక ఆర్ఎస్ఎస్ కార్యకర్త పరువు నష్టం కేసు వేశారు.
గతేడాది జూన్‌లో ఈ కేసు విచారణ కోసం బివాండీ కోర్టు ముందు హాజరైన రాహుల్... తాను ఎలాంటి తప్పు చేయలేదని తెలిపారు. అయితే న్యాయస్థానం ఆయనపై ఐపీసీ సెక్షన్ 499, సెక్షన్ 500ల కింద పరువునష్టం కేసులు నమోదు చేసింది. ఇవి కూడా త్వరలో విచారణకు రానున్నాయి.