19 మంది జవాన్లను పొట్టనపెట్టుకున్న ఘటనకు భారత సైన్యం బదులిచ్చిన వేళ అది.. కన్నీటి సంద్రమైన భరతమాత నేత్రాలు ఎరుపెక్కి... పాక్ ఉగ్రవాద శిబిరాలపై లక్షిత దాడులుగా మారిన వేళ అది... ప్రతి భారతీయుడి ఛాతీ గర్వంతో ఉప్పొంగిన సమయమది.. 'ఉరీ' ఘటనపై పాక్‌కు కోలుకోలేని.. మూడేళ్లైనా తేరుకోలేని 'మెరుపు' దెబ్బ అది.
ఏం జరిగింది..?
2016 సెప్టెంబర్ 19... జమ్ముకశ్మీర్‌లోని ఉరీ ప్రాంతంలోని భారత బ్రిగేడ్ స్థావరంపై జవాన్లు నిద్రిస్తోన్న వేళ నలుగురు ముష్కరులు మారణాయుధాలతో తెగబడ్డారు. ఈ దాడిలో 19 మంది జవాన్లు అమరులయ్యారు. ఈ ఘటనతో యావత్ దేశం కన్నీటి పర్యంతమైంది. ప్రతీకారాగ్నితో రగిలిపోయింది.
మరో భారీ పన్నాగానికి కుట్రలు జరుగుతోన్న సమాచారం అందుకున్న భారత సైనికులు.. ఉగ్రవాదులను వేటాడేందుకు చరిత్రలోనే తొలిసారిగా 2016 సెప్టెంబర్ 28.. అర్ధరాత్రి నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ)ను దాటి.. గంటల వ్యవధిలో ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుని సెప్టెంబర్ 29 సూర్యోదయానికి ముందే సురక్షితంగా తిరిగివచ్చారు.
భారత సహనాన్ని పరీక్షిస్తే చూస్తూ ఊరుకునేది లేదని పాక్‌కు గట్టి హెచ్చరిక పంపారు. దాడుల్లో ఎంతమంది ఉగ్రవాదులు హతమయ్యారన్న వివరాలను సైన్యం ప్రకటించకున్నా.. 40 మందికిపైనే ముష్కరులు హతమైనట్లు తెలిపారు. భారత జవాన్ల సాహసిక చర్యపై యావత్ జాతి హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది.
ఎందుకు...?
ఉరీ ఘటనతో సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని సంకేతాలు ఇచ్చిన భారత సైన్యం.. ఉగ్రవాదులకు తడాఖా చూపింది. మరోమారు జమ్ముకశ్మీర్‌లో, వివిధ మెట్రో నగరాల్లో భారీ విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు కుట్రలు పన్నారన్న విశ్వసనీయ సమాచారం అందుకున్న భద్రతాదళాలు.. ఉగ్రవాదులపై అనూహ్యంగా మెరుపుదాడి చేశారు.
అర్ధరాత్రి దాటిన తర్వాత నియంత్రణరేఖకు ఆవల.. రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న ఏడు ఉగ్రవాద శిబిరాలపై భారత కమెండోలు విరుచుకుపడ్డారు. హెలికాప్టర్లు, భూమార్గం ద్వారా భారత సైన్యంలోని ప్రత్యేకదళాలకు చెందిన మూడు డివిజన్ల పారా కమెండోలు లక్షిత ప్రాంతాలను చేరుకుని ఆపరేషన్ మొదలు పెట్టారు. అర్ధరాత్రి 12.30 కి మొదలైన లక్షిత దాడి.. ఉదయం 4.30 వరకూ కొనసాగింది.
విశ్వసనీయ సమాచారం...