తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీనియర్లు X యువనేతలు... కాంగ్రెస్​లో కలవరం! - మహారాష్ట అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్​

మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికలు సమీస్తున్న తరుణంలో అంతర్గత విభేధాల కారణంగా కాంగ్రెస్​ వర్గాల్లో ఆందోళన నెలకొంది. సీనియర్ నాయకులు, యువనేతల మధ్య ఆధిపత్య పోరుతో పార్టీకి నష్టం వాటిల్లుతుందని బాహాటంగానే తమ అభిప్రాయాలను చెబుతున్నారు కొంతమంది నేతలు. మరోవైపు రెండు రాష్ట్రాల్లో విజయం తమదేనని ధీమాగా ఉంది భాజపా.

సీనియర్లు Vs యువనేతలు...కాంగ్రెస్​లో కలవరం!

By

Published : Oct 11, 2019, 10:21 AM IST

అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్న హరియాణా, మహారాష్ట్రల్లో కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్లు, యువ నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఈ పరిణామాలు పార్టీకి చేటు చేస్తాయని కాంగ్రెస్‌ వర్గాలే ఆందోళన చెందుతున్నాయి. రాహుల్‌ గాంధీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వివిధ పార్టీ పదవుల్లో నియమించిన యువనేతలకు ఇటీవల కాలంలో ప్రాధాన్యం దక్కడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న భాజపాకు గట్టిపోటీ ఇవ్వాల్సిన తరుణంలో ఇలాంటి విభేదాలతో కాంగ్రెస్‌ రాష్ట్ర విభాగాలు సతమతమవుతున్నాయని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు.

ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో హరియాణా, మహారాష్ట్రల్లో ఎదురైన పరాజయ భారాన్ని అధిగమించేందుకు అవకాశం వచ్చినా.. కొద్ది నెలలుగా కాంగ్రెస్‌లో చోటు చేసుకున్న పరిణామాలు ఎటు దారితీస్తాయోనన్న ఆందోళన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. టికెట్ల పంపిణీలో అక్రమాలు చోటు చేసుకున్నాయని.. కష్టించి పనిచేసిన వారికి అవి దక్కలేదని హరియాణా కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు అశోక్‌ తన్వర్‌, మహారాష్ట్రలోని పార్టీ ముంబయి విభాగం మాజీ అధ్యక్షుడు సంజయ్‌ నిరుపమ్‌లు బాహాటంగానే గళమెత్తారు.

విభేదాల ‘కురుక్షేత్రం!

హరియాణాలో ఊపు మీదున్న అధికార భాజపాకు, ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌కు ఎన్నికల్లో సవాల్‌ విసరాలంటే కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులన్నీ కలసికట్టుగా పనిచేయాలి. అయితే కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, కీలక దళిత నేత అశోక్‌ తన్వర్‌ కొద్ది రోజుల క్రితం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా ప్రకటించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ ఆయనను పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పించి మరో దళిత నేత కుమారి సెల్జాకు ఆ బాధ్యతలు కట్టబెట్టింది. రాష్ట్రంలో పార్టీ ఎన్నికల ప్రచార బాధ్యతలను నిర్వర్తిస్తున్న మాజీ ముఖ్యమంత్రి భూపీందర్‌ సింగ్‌ హుడాకు, తన్వర్‌కు మధ్య విభేదాలే ఈ పరిస్థితికి దారి తీశాయన్నది బహిరంగ రహస్యం. హరియాణా ఓటర్లలో దాదాపు 25 శాతం జాట్‌లు కాగా.. అదే సామాజిక వర్గ నేతగా పట్టున్న భూపీందర్‌ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. భాజపాను సవాల్‌ చేయగల సత్తా ఉన్న నేతగా ఆయనను కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది. సెల్జా, భూపీందర్‌ సంఘీభావంతో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నప్పటికీ దశాబ్దాల తరబడి వారి మధ్య విభేదాలున్న విషయాన్ని రాజకీయ పరిశీలకులు ప్రస్తావిస్తున్నారు. హరియాణాలో ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేని కాంగ్రెస్‌ బలంగా కనిపిస్తున్న భాజపాను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.

'మహా' అసమ్మతి!

మహారాష్ట్రలోనూ కాంగ్రెస్‌ పార్టీలో విభేదాలు బయట పడ్డాయి. కొద్ది నెలల క్రితం సీనియర్‌ నేత రాధాకృష్ణ విఖే పాటిల్‌ పార్టీని వీడారు. బాలాసాహెబ్‌ థోరాట్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల పోరు సాగిస్తోంది. కీలక నేత, ముంబయి కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు సంజయ్‌ నిరుపమ్‌ బాహాటంగానే పార్టీ సీనియర్లపై నిరసన గళమెత్తారు. కష్టపడిన వారికి టికెట్లు దక్కలేదని, తనకు వ్యతిరేకంగా కొందరు పనిచేశారని ఆరోపించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో మొత్తం 48 స్థానాలకు గాను 2 చోట్ల మాత్రమే గెలుపొందిన కాంగ్రెస్‌ ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఒక్క స్థానానికే పరిమితమైంది. తాజా ఎన్నికల్లో నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీతో కలిసి బరిలోకి దిగిన కాంగ్రెస్‌.. అధికార భాజపా-శివసేన కూటమిపై ఎలాంటి ఫలితాలు సాధిస్తుందో చూడాలి. తన్వర్‌, నిరుపమ్‌లు మాత్రమే కాకుండా.. రాహుల్‌గాంధీ గతంలో నియమించిన యువనేతలు పలు చోట్ల ఇబ్బందులు పడుతున్నట్లు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సోనియాగాంధీ తిరిగి పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత సీనియర్లదే పైచేయి అవుతోందని చెబుతున్నారు.

ఎల్లుండి రాహుల్‌ ప్రచారం

కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఈనెల 13, 15తేదీల్లో మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని రాష్ట్ర కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి.

ఈడీ కేసులో ఇరికించారు: పవార్‌

మహారాష్ట్ర సహకార బ్యాంకు కుంభకోణానికి సంబంధించి ఈడీ కేసులో తనను ఇరికించారని, ఆ బ్యాంకులో తాను కనీసం సభ్యుడిని కూడా కాదని ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ ఆరోపించారు. హింగన్‌ఘాట్‌లో ఎన్నికల ప్రచారసభలో ఆయన గురువారం భాజపాను దుయ్యబట్టారు.

ఇంటికో తాజ్‌మహల్‌ అంటారు..!

ప్రతిపక్షాలు ఇంటికో తాజ్‌మహల్‌ కట్టి ఇస్తామని చెప్పినా ఆశ్చర్యపోనవసరం లేదంటూ.. ఆ పార్టీల మ్యానిఫెస్టోలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ ఎద్దేవా చేశారు. మంగళ్‌వేధ ఎన్నికల ప్రచారసభలో ఆయన మాట్లాడారు. ఇక్కడ ఎన్నికలు జరుగుతుంటే రాహుల్‌గాంధీ బ్యాంకాక్‌లో పర్యటిస్తున్నారని విమర్శించారు.

ఈడీ విచారణకు బెదిరిపోను : రాజ్‌ఠాక్రే

నగదు అక్రమ చలామణి కేసులో ఈడీ జరిపిన విచారణతో తానేమీ బెదిరిపోవడం లేదని మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధిపతి రాజ్‌ఠాక్రే స్పష్టం చేశారు. గోరెగావ్‌, శాంతాక్రజ్‌ శివార్లలో నిర్వహించిన ఎన్నికల ప్రచారసభల్లో ఆయన మాట్లాడారు. ఇలా బెదిరించడం వల్లే కొందరు భాజపాలో చేరారన్నారు.

‘నన్ను గెలిపిస్తే.. ట్రాఫిక్‌ చలానాలుండవ్‌!

హరియాణాలోని ఫతేహాబాద్‌ భాజపా అభ్యర్థి దూదారామ్‌ బిష్ణోయ్‌ ఓటర్లకు ఓ వినూత్న హామీ ఇస్తున్నారు. తనను గెలిపిస్తే ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించినా చలానా రాకుండా చూస్తానని చెప్పారు.

ఇదీ చూడండి: షా- ఠాక్రే ప్రచారాలతో 'మహా' పోరుకు జోరు

ABOUT THE AUTHOR

...view details