బాలాకోట్ వాయుదాడుల్లో ఉగ్రవాదులు మరణించారని పాకిస్థాన్ గిల్గిత్లోని అమెరికా కార్యకర్త సెంగె హస్నన్ సెరింగ్ బయటపెట్టారు. వారి మృతదేహాలను బాలాకోట్ నుంచి ఖైబర్ పంఖ్తుఖ్వాతోపాటు, ఇతర గిరిజన ప్రాంతాలకు తరలించినట్టు ఉర్దూ మీడియా వద్ద నివేదికలు ఉన్నాయని వివరించారు. ఈ ఆధారాలకు ఊతమిచ్చేలా ఓ పాక్ ఆర్మీ అధికారి మాట్లాడిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేశారు సెరింగ్.
ఆ వీడియోలో పాకిస్థాన్ సైన్యాధికారి చెబుతున్న దాని ప్రకారం 200 మందికి పైగా ఉగ్రవాదులు మరణించినట్టు తెలుస్తోంది.
"దేవుని నుంచి ప్రత్యేక ఉపాధి పొంది పాకిస్థాన్ ప్రభుత్వానికి సహకరించి అమరులయ్యారు. వారి కుటుంబాలకు అండగా ఉంటాం. "
-వీడియోలో పాక్ సైన్యాధికారి మాటలు
పాకిస్థాన్ వైఖరిపై సెరింగ్ పలు అనుమానాలు వ్యక్తం చేశారు.
"ఈ వీడియో నిజమైందో కాదో తెలియదు. కానీ బాలాకోట్‌కు సంబంధించి ఏదో ముఖ్యమైన విషయాన్ని పాకిస్థాన్ దాచిపెడుతోంది. ఆ ప్రదేశంలోకి వెళ్లేందుకు ఎవరినీ అనుమతించట్లేదు. కొన్ని చెట్లు, పంట పొలాలు నాశనమయ్యాయని మాత్రమే చెబుతూ వస్తోంది. చుట్టు పక్క ప్రాంతాల్లో ఎలాంటి కారణాలు చెప్పకుండా తనిఖీలు చేపడుతోంది. సంఘటన జరిగిన ప్రాంతంలో అంతర్జాతీయ మీడియాను తీసుకెళతామని చెప్పినా ఇప్పటికీ అనుమతివ్వట్లేదు."
- ఏఎన్ఐ వార్తా సంస్థతో సెంగె హస్నన్ సెరింగ్
వాయుదాడిలో భారత్ విజయం సాధించిందనే సెరింగ్ భావిస్తున్నారు.
"బాలాకోట్‌లో తాము నిర్వహిస్తున్న మదర్సా ఉన్నట్లు జైషే మహ్మద్ ఒప్పుకుంది. మరోవైపు దాడి జరిగిన అనంతరం బాలాకోట్ నుంచి కొన్ని మృతదేహాలను ఖైబర్ పంఖ్తుఖ్వాకు తరలించినట్టు ఉర్దూ మీడియా చెబుతోంది. భారత వాయుసేన విజయం సాధించిందని చెప్పేందుకు ఈ ఆధారాలు సరిపోతాయి. అంతర్జాతీయ లేదా జాతీయ మీడియా సంఘటన స్థలాన్ని దర్శించే వరకూ పాకిస్థాన్ ఓటమిని అంగీకరించాల్సి ఉంటుంది."
-ఏఎన్ఐ వార్తా సంస్థతో సెంగె హస్నన్ సెరింగ్
పుల్వామా ఉగ్రదాడి తర్వాత ముందస్తు భద్రతా చర్యలను భారత్ ముమ్మరం చేసింది. పాకిస్థాన్ బాలాకోట్‌లోని ఉగ్రస్థావరంపై యుద్ధవిమానాలతో ఫిబ్రవరి 26న దాడులు చేసినట్టు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే ప్రకటించారు. ఇందులో భారీ సంఖ్యలో ఉగ్రవాదులు మరణించారని గోఖలే తెలిపారు. పాకిస్థాన్ మాత్రం ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని బుకాయిస్తోంది.
ఇదీ చూడండి:ఉగ్రవాదంపై చర్యలకు పాక్ హామీ