తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కాంగ్రెస్​ నిధులకు.. చైనాతో ఉద్రిక్తతలకు సంబంధమేంటి?'

రాజీవ్​ గాంధీ ఫౌండేషన్​కు చైనా నుంచి నిధులు సమకూరాయని కాంగ్రెస్​పై భాజపా చేసిన ఆరోపణలను శివసేన తప్పుబట్టింది. సరిహద్దులో చైనా చొరబాట్లకు, 20 మంది భారత జవాన్ల మృతికి దీనితో సంబంధమేంటని ప్రశ్నించింది. కాంగ్రెస్​తో అవసరమైతే తర్వాత తగువు పెట్టుకోవచ్చు గానీ, సరిహద్దులో పరిస్థితిపై విపక్షాల ప్రశ్నలకు భాజపా జవాబు చెప్పాలని సామ్నా పత్రికలో వ్యాసం ప్రచురించింది.

Sena slams BJP over RGF donations charge amid China standoff
కాంగ్రెస్​పై భాజపా విమర్శలను తప్పుబట్టిన శివసేన

By

Published : Jun 27, 2020, 4:09 PM IST

తూర్పు లద్దాఖ్​ సరిహద్దులో చైనాతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో కాంగ్రెస్​పై భాజపా చేసిన విమర్శలను ఖండించింది శివసేన. చైనా నుంచి రాజీవ్​ గాంధీ ఫౌండేషన్​కు నిధులు సమకూరాయని కమలం పార్టీ చేసిన ఆరోపణలపై మండిపడింది. సరిహద్దులో చైనా చొరబాట్లకు, 20మంది అమరులైన ఘటనకు ఈ విషయంతో సంబంధం ఏంటని ప్రశ్నించింది. తూర్పు లద్దాఖ్​లో చైనా బలగాలు భారత భూభాగంలోకి అడుగుపెట్టాయో లేదో చెప్పాలని విపక్షాలు అడుగుతున్న ప్రశ్నలకు భాజపా సమాధానం చెప్పాలని తన అధికారిక పత్రిక సామ్నాలో వ్యాసం ప్రచురించింది సేన.

"కాంగ్రెస్​కు చైనా నుంచి నిధులు అందాయని భాజపా చేసిన ఆరోపణలకు అర్థమేంటి? చైనా చొరబాట్లకు సంబంధించి సోనియా గాంధీ, రాహుల్​ గాంధీ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా.. చైనా నుంచి కాంగ్రెస్​కు నిధులు వస్తున్నాయని భాజపా నేతలు ఆరోపిస్తున్నారు. భాజపా బహిర్గతం చేసిన ఈ విషయాలతో సరిహద్దులో చైనా తన కార్యకలాపాలను నిలిపివేస్తుందా? నిధులకు, చైనా చొరబాట్లకు సంబంధమేంటి? కాంగ్రెసే కాదు చాలా పార్టీలకు విదేశాల నుంచి నిధులు సమకూరుతాయి. ఈ విషయంపై భాజపా మాట్లాడటం బురదలోకి రాయి విసరడం లాంటిదే. చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​ గత ఆరేళ్లలో రెండు సార్లు భారత్​లో పర్యటించారు. ఆయనకు గుజరాత్​లోనూ ఆతిథ్యం ఇచ్చారు. చైనా వెన్నుపోటు పొడిచిందన్నది వాస్తవం. ఓ వైపు చర్చలు జరపడం.. మరోవైపు సరిహద్దులో దుశ్చర్యలకు పాల్పడటం చైనాకు అలవాటే. అది వారి పాత విధానమే. ప్రస్తుత పరిస్థితుల్లో యావత్​ దేశం ప్రధాని మోదీకి మద్దతుగా నిలబడుతుంది. ఇది కాంగ్రెస్​, భాజపాల సంక్షోభం కాదు. దేశ ప్రతిష్టకు సంబంధించిన విషయం. మీరు కావాలంటే తర్వాత తగువులాడండి. ఇప్పుడు మాత్రం చైనాపై పోరాడండి. ఆ విషయంపై మాత్రమే మాట్లాడండి"

-సామ్నా పత్రికలో శివసేన.

గాంధీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని రాజీవ్​ గాంధీ ఫౌండేషన్​కు చైనా నుంచి నిధులు వచ్చాయని గురువారం ఆరోపించారు భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా. దీనిపై కాంగ్రెస్​ తీవ్రంగా స్పందించింది. సరిహద్దులో వాస్తవాధీన రేఖ వద్ద సంక్షోభం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే భాజపా ఈ ఆరోపణలు చేస్తోందని ధ్వజమెత్తింది.

ఇదీ చూడండి: కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్​పై ఈడీ ప్రశ్నల వర్షం

ABOUT THE AUTHOR

...view details