మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలను వ్యతిరేకిస్తూ శివసేన పార్టీ శనివారం.. కేంద్రంపై తీవ్రంగా విరుచుకుపడింది. ఆర్థికవ్యవస్థ, వాణిజ్యం, వ్యవసాయం సహా పలు రంగాల ప్రైవేటీకరణ నిర్ణయాలపై కేంద్రాన్ని తప్పుపడుతూ అధికార పత్రిక 'సామ్నా' వేదికగా విమర్శలు గుప్పించింది. కేంద్రం తమ కూటమి పార్టీలను, రైతు సంఘాలను, ప్రతిపక్షాలను సంప్రదించకుండా పార్లమెంటులో వ్యవసాయ బిల్లులను ప్రవేశపెట్టిందని, ఆ విధానమే కేంద్రమంత్రి హర్‌సిమ్రత్ కౌర్ పదవి రాజీనామాకు దారి తీశాయని ఆ పార్టీ విమర్శించింది.
'వాజ్‌పేయీ హయాంలో ఎన్డీఏ వేరుగా ఉండేది' - మోదీ ప్రభుత్వ రాజకీయ విధానాలపై శివసేన గరం
ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కేంద్రంపై విమర్శలు గుప్పించింది శివసేన. కూటమి పార్టీలను, రైతు సంఘాలను, విపక్షాలను సంప్రదించకుండా పార్లమెంటులో వ్యవసాయ బిల్లులను ప్రవేశపెట్టిందని తన అధికారిక పత్రిక సామ్నాలో విరుచుకుపడింది శివసేన. దివంగత వాజ్‌పేయీ హయాంలో ఎన్డీఏ వేరుగా ఉండేదని తెలిపింది.
''మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ, భాజపా సీనియర్ నాయకుడు ఎల్‌కే అడ్వాణీ హయాంలో ఉన్న ఎన్డీఏ భిన్నంగా ఉండేది. వారు ఎన్డీఏలోని భాగస్వాములకు గౌరవం ఇచ్చేవారు. ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే సంప్రదింపులు జరిపేవారు. ఇతరుల ఆలోచనలను స్వీకరించేవారు. అప్పట్లో ఏమైనా మాట్లాడితే కాస్త విలువ ఉండేది. ఇప్పుడు పరిస్థితి అలా లేదు. అందుకే ఎన్డీఏలో నుంచి శివసేన బయటికి వచ్చింది. ఇప్పుడు శిరోమణి అకాళీదళ్‌కూ ఆ సమయం వచ్చింది. అందుకే కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక బిల్లులపై నిరసన వ్యక్తం చేస్తూ హర్‌సిమ్రత్ కౌర్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు.'' అని ఆ పార్టీ విమర్శించింది.
''మహారాష్ట్ర మాదిరిగానే పంజాబ్ ఆర్థిక వ్యవస్థ కూడా వ్యవసాయంపై ఆధారపడి ఉంది. రైతులకు సంబంధించిన బిల్లులను తీసుకువచ్చే విషయంలో ప్రభుత్వం మహారాష్ట్ర, పంజాబ్ సహా దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ నిపుణులను, రైతు సంఘాలను సంప్రదించాల్సిన అవసరం ఉంది. కానీ అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. విమానాశ్రయాలు, రేవులు, రైల్వే, బీమా సంస్థల ప్రైవేటీకరణ మాదిరిగా రైతుల జీవితాలను కూడా ప్రైవేటు వ్యాపారుల చేతిలో పెడుతోంది. ఆ బిల్లులు రైతులకు మేలు చేసేవే అని ప్రభుత్వం చెబుతోంది. మరి అలాంటప్పుడు ఒకసారి రైతు నాయకులను సంప్రదించడానికి ఏమిటి సమస్య'' అని శివసేన ప్రశ్నించింది.