గుజరాత్ అహ్మదాబాద్‌లో ఫిబ్రవరిలో నిర్వహించిన 'నమస్తే ట్రంప్' కార్యక్రమం వల్ల గుజరాత్, ముంబయి, దిల్లీల్లో కరోనా వ్యాపించిందని శివసేన పార్టీ నాయకుడు సంజయ్ రౌత్ ఆరోపించారు. కరోనా కట్టడికి ఎటువంటి ముందస్తు ప్రణాళికలు లేకుండా కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించిందని.. ఇప్పుడు ఆ బాధ్యతను రాష్ట్రాలకు వదిలివేసిందని తీవ్రంగా విమర్శించారు సంజయ్.
ఎలాంటి ముప్పు లేదు!
ఒకవైపు మహమ్మారితో రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్రతిపక్ష భాజపా పన్నాగాలు పన్నుతోందని దుయ్యబట్టారు సంజయ్. అయితే రాష్ట్ర ప్రభుత్వ మనుగడకు ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేశారు. శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్‌లతో చాలా దృఢంగా ఉందని సంజయ్ పేర్కొన్నారు.
"అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఆహ్వానించడానికి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. అప్పటి నుంచి వైరస్ వ్యాప్తి చెందింది. ట్రంప్‌తో పాటు వచ్చిన కొంతమంది ప్రతినిధులు ముంబయి, దిల్లీ ప్రాంతాలను సందర్శించారు. అందువల్లే కరోనా వ్యాపించింది."