తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నిర్బంధం'తోనే కరోనా మహమ్మారికి కళ్లెం

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల్లో వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇతర దేశాలతో పోలిస్తే.. భారత్​లో తక్కువ కేసులే నమోదైనా, సామాజికంగా దీని వ్యాప్తి గురించిన ఆందోళన ఎక్కువగా ఉంది. ఒకరి నుంచి మరొకరికి వ్యాపించడం మొదలైతే, వ్యాధి లక్షణాలు ఉన్న వ్యక్తులు స్వీయ నిర్బంధాన్ని పాటించాల్సి ఉంటుంది. దాన్ని అతిక్రమిస్తే దేశం ప్రజారోగ్య సునామీని ఎదుర్కోవాల్సిన ప్రమాదకర పరిస్థితి ఎదురువుతుంది.

corona
'నిర్బంధం'తోనే కరోనా మహమ్మారికి కళ్లెం

By

Published : Mar 28, 2020, 7:20 AM IST

భారత్‌లో కొవిడ్‌-19 కేసుల సంఖ్య 700కు పైగా ఉంది. మరణాల సంఖ్యా క్రమంగా పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా వైరస్‌కు బలయినవారి సంఖ్య పాతిక వేలకుపైనే. కేసుల సంఖ్య 5.50 లక్షలకు పైగా ఉంది. కేసులు పెరుగుతూ ఉండటం వల్ల ఈ సంఖ్యలూ నిరంతరం మారుతున్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే, భారత్‌లో తక్కువ కేసులే నమోదైనా, సామాజికంగా దీని వ్యాప్తి గురించిన ఆందోళన ఎక్కువగా ఉంది. ఒకరి నుంచి మరొకరికి వ్యాపించడం మొదలైతే, కరోనా వ్యాధి లక్షణాలు కనిపిస్తున్న వ్యక్తులు స్వీయ నిర్బంధాన్ని పాటించాల్సి ఉంటుంది. దాన్ని అతిక్రమిస్తే దేశం ప్రజారోగ్య సునామీని ఎదుర్కోవాల్సిన ప్రమాదకర పరిస్థితి ఎదురవుతుంది. ప్రధాని నరేంద్రమోదీ స్వీయ క్రమశిక్షణ పాటించాలని, సంయమనం, సంకల్పాన్ని ప్రదర్శించాలని పిలుపునివ్వడం, దేశవ్యాప్తంగా నిర్బంధాన్ని ప్రకటించడం సరైనవే.

సాయుధ దళాల పాత్ర..

ప్రస్తుత పరిస్థితుల్లో మరిన్ని క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. ఈ విషయంలో భారత సాయుధ దళాలు తమ వంతు పాత్రను నిశ్శబ్దంగా పోషిస్తున్నాయి. ఇటీవల విశాఖపట్నంలో తూర్పు నౌకా కమాండ్‌లో కొవిడ్‌ క్వారంటైన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇంతకుముందు జైసల్మేర్‌, మనేసర్‌లలో ప్రారంభించిన కేంద్రాల్ని సాయుధ దళాలు పర్యవేక్షిస్తుంగా, ముంబయిలో నావికాదళం, హిండన్‌లో వైమానిక దళం నిర్వహిస్తున్నాయి. మరిన్ని క్వారంటైన్‌ కేంద్రాల్ని సిద్ధం చేస్తున్నట్లు రక్షణ శాఖ ప్రకటించింది. అవి- జోధ్‌పుర్‌, కోల్‌కతా, చెన్నై, దుండిగల్‌, బెంగళూరు, కాన్పూర్‌, జోర్హాట్‌, గోరఖ్‌పూర్‌, కోచిలలో అందుబాటులోకి రానున్నాయి. సాయుధ దళాలకు ప్రధాన స్థావరాలు ఉన్న నగరాల్లో సైనిక క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాలకు తగినట్లుగా నియమనిబంధనలు పాటించేందుకు వాటిలో తగిన అవకాశం ఉంటోంది. దీనికితోడు, ఈ తరహా సంక్లిష్ట సవాళ్లను ఎదుర్కోవడంలో తగిన నైపుణ్యాలున్న సైన్యం, నావికా, వైమానిక దళాలకు చెందిన వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారు.

భారత్‌కు సంబంధించి ఇది సంక్లిష్ట సవాలే. సైనిక సిబ్బంది సాయంతో పెద్ద సంఖ్యలో పౌరుల్ని క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉంచాల్సి రావడం లేదా పరిశీలనలో పెట్టడం వంటి పరిస్థితి మునుపెన్నడూ అనుభవంలోకి రాలేదు. ఈ క్రమంలో కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలూ ఎదురవుతున్నాయి. కరోనా వైరస్‌ సోకిన కొంతమంది పౌరులు నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని చోట్ల క్వారంటైన్‌కు వెళ్లేందుకు నిరాకరిస్తూ ధర్నాకు దిగుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. స్థానిక పోలీసులు జోక్యం చేసుకొని పరిస్థితుల్ని చక్కదిద్దాల్సి వస్తోంది.

అత్యవసర ప్రణాళిక అవసరం..

కరోనా వ్యాప్తికి సంబంధించి ఇటలీ, స్పెయిన్‌, ఇరాన్‌, అమెరికా ఇప్పటికే సంక్లిష్ట దశకు చేరుకున్నాయి. భారత్‌ ఆందోళనకరమైన మూడో దశను ఎదుర్కోవాల్సి వస్తే, ఇక్కడుండే విస్తారమైన జనాభాకు ప్రస్తుతమున్న కరోనా పరీక్ష కేంద్రాలు ఏ మూలకూ సరిపోవు. ఇలాంటి పరీక్ష కేంద్రాల ఏర్పాటుకు అత్యవసర ప్రణాళికను రూపొందించుకోవాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా, తాలూకా, పంచాయతీ, బస్తీలు, కార్పొరేట్‌ సంస్థలు, విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, బడులు తదితర వాటన్నింటిలోనూ అమలవ్వాలి. చాలా స్వల్పవ్యవధి ప్రకటనతోనే పలు క్వారంటైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం నెలకొనవచ్చు. అందుకు తగిన వేదికల్ని గుర్తించాలి. బాధితుల సంఖ్య పెరుగుతున్నప్పుడు వీటిని అప్పటికప్పుడు క్వారంటైన్‌ కేంద్రాలుగా తీర్చిదిద్దాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏర్పాటైన సైనిక క్వారంటైన్‌ కేంద్రాలు నమూనాలా ఉపయోగపడతాయి. కేంద్రాలను సమర్థంగా పర్యవేక్షించాలి. తగిన సౌకర్యాలనూ కల్పించాలి. పరీక్ష ఫలితాలు నెగెటివ్‌గా వస్తేనే బయటికి పంపించాలి. కొవిడ్‌-19 బారిన పడినట్లు నిర్ధారించిన వారిని చికిత్స అందించే వైద్య సంస్థలకు పంపించాల్సి ఉంటుంది.

చైనా నమూనా..

ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే... దేశవ్యాప్తంగా త్వరలోనే మానవ వనరులు, సరకులకు సంబంధించి ఆకస్మిక డిమాండ్‌ తలెత్తే అవకాశాలున్నాయి. ఇప్పటికే తీవ్ర పని ఒత్తిడిలో ఉన్న సుశిక్షిత వైద్య సిబ్బందితోపాటు నిబద్ధులైన స్వచ్ఛంద సేవకుల అవసరం పడుతుంది. ఇలాంటి వాలంటీర్లను క్వారంటైన్‌ సహాయకులుగా గుర్తించవచ్చు. వీరికి శిక్షణ అందించాలి. వారిలో బృంద నాయకులను గుర్తించి అవగాహన పెంపొందించాలి. క్వారంటైన్‌ చేయాల్సిన బాధితుల సంఖ్య పెరిగిపోతే గంటల వ్యవధిలో సౌకర్యాల్నీ పెంపొందించాల్సి ఉంటుంది. ఈ విషయంలో చైనా నమూనా అనుసరణీయం.

మన దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా అధికారుల ద్వారా పదవీ విరమణ పొందిన ప్రభుత్వ, సైనిక సిబ్బందిని గుర్తించాలి. అత్యంత స్వల్పవ్యవధిలో వాలంటీర్ల బృందాల్ని రూపొందించే, తీర్చిదిద్దే సామర్థ్యం వారికి ఉంటుంది. ఇలాంటి విషయాల్లో సామాజిక మాధ్యమాలనూ ఉపయోగించుకోవాలి. మంచాలు, తువ్వాళ్లు, ఆస్పత్రుల్లో ఉపయోగించే వస్త్రాలు వంటి కనీస అవసరాలను సమకూర్చుకునే నిమిత్తం విరాళాల్ని ప్రోత్సహించేందుకు సామాజిక మాధ్యమాల సహాయం తీసుకోవాలి. రాబోయే కొన్ని వారాలపాటు బడులు, కళాశాలలను మూసే ఉంచుతారు. ఈ క్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులను రంగంలోకి దింపి, సహాయకులుగా పని చేసేలా శిక్షణ అందించాల్సిన అవసరం ఉంది. వివిధ రంగాల ప్రముఖ వ్యక్తులు, సామాజిక మాధ్యమాల్లో ప్రభావం చూపించగలిగేవారి తోడ్పాటు కూడా తీసుకోవచ్చు.

- సి.ఉదయ్​భాస్కర్​ (రచయిత, నౌకాదళ విశ్రాంత అధికారి)

ABOUT THE AUTHOR

...view details