మనం యుద్ధంలాంటి పరిస్థితిలో ఉన్నాం. భారత్ మునుపెన్నడూ ఎదుర్కోనంతటి ప్రమాదకరమైన కంటికి కనిపించని శత్రువుతో పోరాడుతోందని చెప్పవచ్చు. ఈ యుద్ధంలో ఎంతమంది మనుషులు మరణిస్తారనేది అంతా సద్దుమణిగాకగాని తెలియదు. కానీ, ఇప్పటికే ఇది మన దేశ శ్రేయస్సు, జీవన విధానం, భవిష్యత్తుపై గట్టిదెబ్బే కొట్టింది. గతంలో చాలా వరకు యుద్ధాల్ని ఏకరూప దుస్తుల్లో ఉన్నవారే చేసేవారు. పౌరుల్ని చాలావరకు నిమగ్నం చేసేవారుకాదు. ఇప్పుడంతా మారిపోయింది. ప్రతి పౌరుడూ ఒక సైనికుడిలా మారారు. పౌరుడి నుంచి పౌర సైనికుడిగా మారడం అంతతేలికేమీ కాదు. ఈ విషయంలో సైనిక జీవితం నుంచి మార్గదర్శనం కోసం కొన్ని పాఠాల్ని నేర్చుకోవచ్చు. ఒక పదాతిదళ సైనికుడు శత్రువుపై దాడి చేసే సందర్భంలో, వెనక ఉండే ఫిరంగిని పేల్చే సైనికులు శత్రువును దిగ్భ్రాంతపరచేందుకు వేల సంఖ్యలో పేలుడు పదార్థాల్ని పేలుస్తారు. రవాణాకు సంబంధించిన సైనికుడు వెనక ఉండే స్థావరాల్లో కూర్చుని ఆయుధాలు, ఆహారం ఇతరత్రా నిత్యావసరాల సరఫరాలు అందేలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఈ వ్యవస్థలో ఏ ఒక్కరైనా తమకు అప్పగించిన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించకపోతే యుద్ధంలో ఓడిపోయినట్లే. ప్రస్తుతం మనం కరోనా వైరస్‌పై చేస్తున్న సమరంలో వైద్యులు, నర్సులు, పోలీసు అధికారులు, అత్యవసర సిబ్బంది ముందువరసలో ఉండి పోరాడుతున్నారు. ప్రతి పౌరుడూ వారి వెనక అండగా నిలబడి వారిపై భారాన్ని తగ్గించాల్సి ఉంది.
స్వీయ నియంత్రణ లేకపోతే...
సైనికుల యుద్ధాన్ని సమర్థంగా మార్చే కారకం... ఆదేశాలకు గట్టిగా కట్టుబడి ఉండటమే. విధేయతను పాటించకపోతే యుద్ధాల్ని గెలవడం కష్టం. విధేయతే సర్వోన్నత సైనిక ధర్మం. ఈ కరోనా వైరస్ వ్యతిరేక పోరాటంలోనూ అందరిలో దృఢమైన నిబద్ధత ఉండాలి. రూపొందించుకునే ప్రణాళికలు జవాబుదారీతనంతో ఉండాలి. నిష్క్రియాపరత్వం పనికిరాదు. అందుకు తీవ్ర మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. మనం ఎదుర్కొనే ముప్పు తీవ్రతను బట్టి మూల్యం స్థాయి ఉంటుంది. ప్రస్తుత సంక్షోభంలో రాజకీయ నాయకత్వం తీసుకునే నిర్ణయాలు సరైనవా కావా అనేది నిర్ణయించేది చరిత్రే. అయితే, ఆ నిర్ణయాల గురించి చర్చించే సమయం కాదిది. వ్యవస్థపై మనం విశ్వాసం ఉంచాలి. సంఘీభావంతో ముందుకు కదలాలి. శత్రువుపై పోరాటం సాగించాలి.
శత్రువు ముందుంటే...
సైన్యంలో ఒక మాట తరచూ చెబుతుంటారు. ఒకసారి శత్రువును కలిసిన తరవాత ఆపై ఎలాంటి ప్రణాళికబద్ధమైన ఆపరేషన్లు మనుగడ సాగించలేవు. గాలిలో బుల్లెట్లు దూసుకురావడం మొదలైతే... పరిస్థితి మారిపోతుంది. పోరాట క్షేత్రం మధ్యలో ఉండే సైనికులు సైతం పరిస్థితులకు అనుగుణంగా మార్పుల్ని అనుసరించాల్సిందే. క్షేత్రస్థాయిలో ఉండే సైనికులు వాస్తవిక ప్రణాళికను పక్కనపెట్టి తమ సొంత వైఖరి ఆధారంగా ముందుకు సాగొచ్చు. కాకపోతే, లక్ష్యం స్థిరంగా ఉండాలంతే! కరోనా వైరస్‌పై సాగుతున్న ప్రస్తుత యుద్ధంలో పౌరులు రంగంలోకి దిగితే, ఊహించని సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. వాటిని తట్టుకుంటూనే, ప్రాథమికంగా రూపొందించున్న ప్రణాళికలకు భిన్నంగా వ్యూహాల్ని ఎంచుకోవాలి. అయినప్పటికీ, కరోనా వైరస్ వ్యాప్తిని ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకోవాలన్న లక్ష్యాన్ని మాత్రం మరవకూడదు. మన చర్యలన్నీ ఈ తరహా ఏకైక మిషన్‌కేసి సాగాలి. కరోనాపై పోరాటం మనందరి నుంచి త్యాగాల్ని కోరుతుంది. ఈ క్రమంలో ప్రభుత్వం భారాన్ని తగ్గించే దిశగా కృషి చేయాలి. నిత్యావసరాల సరఫరా, మందులు, వ్యాధిగ్రస్థులు, వయోవృద్ధులకు ఆరోగ్య సేవలు, నిత్యావసర సేవల నిర్వహణ వంటివి నిరంతరం ఆగకుండా తప్పనిసరిగా జరగాల్సిన పనులు. సుదీర్ఘంగా లాక్‌డౌన్ చేయడం వల్ల ఎదురయ్యే ప్రభావాన్ని మనం ఇప్పటికే చూస్తున్నాం. రోజువారీ కూలీలు తీవ్రస్థాయిలో బాధితులు. ప్రతి వాణిజ్య రంగమూ ప్రభావితమవుతుంది. నిరుద్యోగిత పెరిగిపోతుంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్) ప్రపంచ మాంద్యం తలెత్తవచ్చని అంచనా వేస్తోంది. అది 2008లో సంభవించిన మహామాంద్యం స్థాయిలో తీవ్ర హానికారకంగా ఉండొచ్చని భావిస్తోంది. పేదలు, వయోవృద్ధులపై పడిన ప్రభావాన్ని తగ్గించేందుకు, వ్యాపార రంగాన్ని కాపాడేందుకు ప్రభుత్వం సత్వరమే ఆర్థికపరమైన ఉద్దీపనల్ని ప్రకటించాలి.