వైశ్విక్ భారతీయ వైజ్ఞానిక్గా పిలిచే 'వైభవ్ సదస్సు-2020'ను ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్ వేదికగా ప్రారంభించారు. విదేశాల్లోని భారతీయ పరిశోధకులు, విద్యావేత్తలను ఒకేచోట చేర్చే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోదీ.. శాస్త్రవేత్తలు, విద్యావేత్తల కృషిని ప్రశంసించారు.
"ఇది గొప్ప మేధావుల సంఘం. శాస్త్రీయ పరిశోధన, ఆవిష్కరణలను పెంచడానికి భారత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. సామాజిక-ఆర్థిక సంస్కరణలకు సైన్స్ ప్రధాన ఆధారం. రైతులకూ సాయపడే విధంగా ఉన్నత స్థాయి శాస్త్రీయ పరిశోధనలు అవసరం. ధాన్యం ఉత్పత్తులను పెంచేందుకు మన శాస్త్రవేత్తలు కష్టపడి పనిచేశారు. విజ్ఞాన శాస్త్రంలో యువత ఆసక్తి పెంచుకోవాల్సిన సమయమిది."
- నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
'కలిసి రండి..'
ప్రపంచ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని మోదీ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ప్రవాస భారతీయులు గుర్తించి మద్దతు ఇవ్వాలని కోరారు. ఇటీవలే అంతరిక్ష పరిశోధన రంగంలో మార్పులు తెచ్చామని, ఇది పరిశ్రమలతో పాటు విద్యా విషయంలో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.