ఒకప్పుడు ఇంట్లో కొళాయి కాని, మిక్సీలు, గ్రైండర్లు కాని చెడిపోతే వీధిచివర మరమ్మతు దుకాణం పెట్టుకున్న ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లను పిలిచి బాగు చేయించేవాళ్లం. ఇప్పుడు అర్బన్ క్లాప్, జస్ట్ డయల్, సులేఖా వంటి సంస్థలను ఆన్‌లైన్‌లో సంప్రతించగానే ఆ నిపుణులు నేరుగా మన ముంగిటే వాలుతున్నారు. వడ్రంగులు, ఇంట్లో బూజు దులిపేవారు కూడా ఆన్‌లైన్‌లో దొరుకుతున్నారు. గతంలో ఎక్కడికైనా వెళ్లడానికి కారు కోసం ట్రావెల్ సర్వీసువారిని సంప్రతిస్తే డ్రైవర్‌తో వాహనాన్ని పంపేవారు. ఇప్పుడు ఓలా, ఉబర్‌లకు స్మార్ట్‌ఫోన్‌లో కబురంపితే చాలు, పని జరిగిపోతోంది. చిటికె వేస్తే చాలు స్విగీ, జొమాటో వంటి సంస్థలు అల్పాహారాన్ని, భోజనాలను మన డైనింగ్ టేబుల్ మీదకు చేర్చుతున్నాయి. అంతా అంతర్జాలం, స్మార్ట్‌ఫోన్ల మహిమ!
ఆన్‌లైన్ ద్వారా అందుబాటులోకి వచ్చి నిర్దిష్ట మొత్తానికి చిన్న చిన్న పనులు చేసిపెడుతున్న వ్యక్తులను అమెరికాలో ‘గిగ్ వర్కర్స్ అంటారు. భారత్‌లోనూ వ్యక్తిగత రవాణా, ఆహార సరఫరా వ్యాపారాల్లో ‘గిగ్ వర్కర్ల’ సందడి పెరిగిపోతోంది. ఇంటింటికి ఆహార రవాణా కోసం 2.10 లక్షలమంది బట్వాడా కుర్రాళ్లను నియమించిన స్విగీ, మరో ఏడాదిన్నరలో వీరి సంఖ్యను అయిదు లక్షలకు పెంచుతానని ప్రకటించడం దీనికి నిదర్శనం. ఉబర్, ఓలా వంటి వ్యక్తిగత రవాణా సంస్థల కింద 15 లక్షలమంది డ్రైవర్లు పనిచేస్తున్నారని అధ్యయనాలు తెలిపాయి.
నైపుణ్యాలే పెట్టుబడి
తక్కువ నైపుణ్యాలతో పని పూర్తిచేసే డ్రైవర్లు, ప్లంబర్లు, బట్వాడా కుర్రాళ్లే కాకుండా అత్యున్నత నైపుణ్యాలున్న సాంకేతిక సిబ్బందీ కాంట్రాక్టు మీద లభ్యమవుతున్నారు. ప్రాజెక్టులవారీగా పనిచేసే ఈ ప్రతిభావంతులను ఫ్లెక్సి వర్కర్లు, ఫ్రీలాన్సర్లుగా వ్యవహరిస్తున్నారు. ఎనలిటిక్స్, ఆటోమేషన్, ఐటీ ఆర్కిటెక్చర్, కృత్రిమ మేధ వంటి హైటెక్ రంగాల్లో ఫ్లెక్సి వర్కర్ల సేవలను టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ వంటి ఐటీ దిగ్గజాలు ఉపయోగించుకుంటున్నాయి. 2018లో ఐటీ, ఐటీఈఎస్ రంగంలో అయిదు లక్షలుగా ఉన్న ఫ్లెక్సి వర్కర్ల సంఖ్య; 2021కల్లా 7.20 లక్షలకు చేరుతుందని ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ (ఐఎస్‌ఎఫ్) తెలిపింది. భారత్‌లో 2018కల్లా అన్ని రంగాల్లో 33 లక్షలకు చేరిన గిగ్, ఫ్లెక్సి వర్కర్ల సంఖ్య, 2021నాటికి 61 లక్షలకు పెరగనుందని ఐఎస్‌ఎఫ్ తెలిపింది. వారిలో 55 శాతం బ్యాంకింగ్, బీమా, ఆర్థిక సేవలు, ఐటీ, ఐటీఈఎస్ రంగాల్లో పనిచేస్తారు. ఫ్లెక్సి లేదా ఫ్రీలాన్స్ ఉద్యోగాల కల్పనలో అమెరికా, చైనా, బ్రెజిల్, జపాన్‌ల తరవాత స్థానాన్ని భారతదేశమే ఆక్రమిస్తోంది.
హరియాణా, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తెలంగాణలలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఫ్లెక్సి వర్కర్ల సంఖ్య బాగా పెరిగే అవకాశం ఉందని ఐఎస్‌ఎఫ్ లెక్కవేసింది. ఇప్పటికే 70 శాతం భారతీయ కంపెనీలు ఏదో ఒక సమయంలో గిగ్-ఫ్రీలాన్స్ వర్కర్ల సేవలను ఉపయోగించుకున్నట్లు ఒక సర్వేలో తెలిపాయి. 2018లో ప్రపంచ గిగ్/ ఫ్లెక్సి మార్కెట్ పరిమాణం 20,400 కోట్ల డాలర్లకు చేరుకోగా అందులో 50 శాతం వాటాను రవాణా సేవలు ఆక్రమించాయి. 2023కల్లా ఈ మార్కెట్ 45,500 కోట్ల డాలర్లకు చేరనుంది. భారత్‌లో ఫ్రీలాన్సర్ మార్కెట్ 2025నాటికి దాదాపు 3,000 కోట్ల డాలర్లకు (రూ.2.10 లక్షల కోట్లకు) చేరవచ్చు. నేడు ప్రపంచంలో ప్రతి నలుగురు ఫ్రీలాన్సర్లలో ఒకరు భారత్‌కు చెందినవారే. హైటెక్ రంగంలో మొదట అంకుర సంస్థల వల్ల ఫ్లెక్సి వర్కర్లు విస్తరించారు. వీరి సేవలు చౌకగా లభిస్తాయనుకుంటే పొరపాటు.
ప్రతిభావంతులైన ఫ్రీలాన్సర్లు ఏడాదికి 20 నుంచి 60 లక్షల రూపాయల వరకు ఆర్జిస్తున్నారని పేపాల్ సంస్థ తెలిపింది. గిగ్/ఫ్లెక్సి వర్కర్లు అందరికీ ఇంత భారీ ఆదాయాలు లభించకపోవచ్చు. గణనీయ సాంకేతిక నైపుణ్యాలు ఉన్నవారు మాత్రమే ఎక్కువ సంపాదించగలుగుతున్నారు. వారికి వెబ్, మొబైల్ డెవలప్‌మెంట్, వెబ్ డిజైనింగ్, ఇంటర్నెట్ రిసెర్చ్, డేటా ఎంట్రీలలో కాంట్రాక్టుపై పనులు లభిస్తున్నాయి. సాంకేతిక అర్హతలు లేకపోయినా సృజనాత్మకత ఉంటే చాలు- రకరకాల తాత్కాలిక పనులు చేసుకోవచ్చు. ఉద్యోగ దరఖాస్తులు రాయడం, వార్తలు, వ్యాసాలు రాయడం (కంటెంట్ రైటింగ్), ఆన్‌లైన్ భరతనాట్యం కోర్సులు, ట్యూషన్లు, ఆయుర్వేద, హోమియో సేవలు అందించడం ద్వారా మున్ముందు చక్కని మొత్తాలు అందుకోవచ్చు.
మరి ఉద్యోగ భద్రత?