జీవితాలను రక్షించుకుంటూనే జీవనోపాధి పొందడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన లాక్‌డౌన్ మినహాయింపులు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్య, మార్కెటింగ్, ఆహారశుద్ధి పరిశ్రమల కార్యకలాపాలను పూర్తిస్థాయిలో కొనసాగించుకోవడానికి ఇప్పటికే అనుమతిచ్చిన కేంద్ర ప్రభుత్వం సోమవారం నుంచి కొత్తగా మునిసిపల్ పరిధి బయట ఉన్న ప్రాంతాల్లోని పరిశ్రమల్లో కార్యకలాపాలకు పచ్చజెండా ఊపింది. ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా లేని 353 జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా జీవనోపాధి పనులు మొదలవుతాయి. మిగిలిన 377 జిల్లాల్లో కంటెయిన్‌మెంట్ జోన్లు మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో పనులు చేసుకోవడానికి వెసులుబాటు లభిస్తుంది. ఈ-కామర్స్ సంస్థలు సరఫరా చేసే అన్ని వస్తువులకూ ఇటీవల మినహాయింపునిచ్చిన హోంశాఖ ఆదివారం ఆ వెసులుబాటును రద్దు చేసింది. టీవీలు, ఫ్రిజ్‌లు, కంప్యూటర్లు వంటివి కాకుండా అత్యవసర వస్తువుల సరఫరాకు మాత్రమే వాటికి అనుమతిచ్చింది. వస్తువుల జాబితా సుదీర్ఘంగా ఉన్నందున వాటన్నింటినీ అనుమతిస్తే కచ్చితంగా లాక్‌డౌన్‌పై ప్రభావం చూపుతుందన్న ఉద్దేశంతో కొన్నింటినే అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. కొన్ని రాష్ట్రాలు మాత్రం ఆంక్షల్ని కొనసాగిస్తామని స్పష్టం చేశాయి.
తప్పులు చేయవద్దు సుమా...
పనులు పునః ప్రారంభించే సమయంలో ఎలాంటి తప్పులూ చేయొద్దని కేంద్రం రాష్ట్రాలను హెచ్చరించింది. వెసులుబాట్లు ఇచ్చిన ప్రాంతాల్లో ఇప్పుడున్న పరిస్థితిని యతాతథంగా కొనసాగించడానికి శాయశక్తులా ప్రయత్నించాలని అప్రమత్తం చేసింది. అవసరమనుకుంటే కేంద్రం విధించిన ఆంక్షలకు అదనంగా మరికొన్నింటిని రాష్ట్ర ప్రభుత్వాలు విధించుకోవచ్చు. క్షేత్రస్థాయి పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వాలకే బాగా తెలుస్తాయి కాబట్టి అదనపు జాగ్రత్తలు, చర్యలు తీసుకొనే అధికారం వాటికే వదిలిపెట్టింది. లాక్‌డౌన్ ప్రకటించిన తర్వాత తొలిసారి పాక్షిక మినహాయింపులను అమల్లోకి తెస్తున్నందున ఈ కాలానికి కేంద్రం చాలా ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో వచ్చే ఫలితాలు బట్టి భవిష్యత్తు కార్యాచరణకు మార్గం చూపే అవకాశం ఉంది. మినహాయింపులు ఇచ్చిన ప్రాంతాల్లో కొత్త కేసులు బయటపడితే వెంటనే అన్నింటినీ రద్దు చేస్తారు.
ప్రాంగణాల్లోనే కార్మికులకు వసతి
పనులు ప్రారంభించే భారీ పరిశ్రమలు, పారిశ్రామిక వాడలు, పారిశ్రామిక సముదాయాల ప్రాంగణాల్లోనే కార్మికులకు వసతి సౌకర్యాలు కల్పించాలని కేంద్ర హోంశాఖ నిర్దేశించింది. దీనివల్ల ఆర్థిక కార్యకలాపాలు పుంజుకొని కార్మికులకు లాభదాయకమైన ఉపాధి కల్పించడానికి వీలవుతుందని ప్రభుత్వ అంచనా. వ్యవసాయ, గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు సాధ్యమైనన్ని ఎక్కువ పనులు కల్పించడానికి జిల్లా కలెక్టర్లు చొరవ చూపాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆదేశించారు. పునరావాస శిబిరాల్లో ఉన్న కార్మికులకు నాణ్యమైన భోజనం అందించి ఇబ్బందుల్లేకుండా చూడాలన్నారు. వలస కూలీలు కొన్ని షరతులకు లోబడి తాము ప్రస్తుతం ఉంటున్న రాష్ట్రపరిధిలోనే పని ఉన్న ప్రాంతాలకు అనుమతులు తీసుకుని వెళ్లొచ్చని, లాక్‌డౌన్ ఉన్నప్పుడు రాష్ట్రం దాటి వెళ్లడానికి మాత్రం వీల్లేదని హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా స్పష్టం చేశారు.
3 వరకు విద్యాసంస్థలు, సినిమా హాళ్లు మూసివేత
కేంద్రం మార్గదర్శకాల ప్రకారం.. అధిక సంఖ్యలో కొవిడ్ కేసులున్న ప్రాంతాలు, నాలుగు రోజుల్లోపు కేసులు రెట్టింపు అవుతున్న ప్రాంతాలను హాట్‌స్పాట్స్‌గా గుర్తించాల్సి ఉంటుంది. ఇక్కడ వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి కంటెయిన్‌మెంట్ జోన్లు, బఫర్ జోన్లు ఏర్పాటుచేయాలి. ఈ కంటెయిన్‌మెంట్ జోన్లలో ఏ మినహాయింపులూ వర్తించవు. అత్యవసర సేవలు మినహా ఎలాంటి పనులూ చేపట్టడానికి వీల్లేదు. ఎలాంటి రాకపోకలు అనుమతించకూడదు. విద్యాసంస్థలు, వాటి అనుబంధ కార్యక్రమాలు, సినిమా హాళ్లు, వాణిజ్య సముదాయాలు, వినోద పార్కులు, అన్నిరకాల సామాజిక, మత, రాజకీయ, క్రీడా, వినోద కార్యక్రమాలూ మే 3 వరకూ పూర్తిగా బంద్ చేయాల్సిందే. టాక్సీలు, ఆటోలు, సైకిల్ రిక్షాలు, క్యాబ్‌లు నడవడానికి వీల్లేదు.
నేటి నుంచి అమల్లోకి వచ్చే కార్యకలాపాలు
- ఆయుష్‌తో సహా అన్ని రకాల వైద్య సేవలు
- అన్ని రకాల సరకు రవాణా వాహనాలు
- గ్రామీణ ఉపాధి హామీ పనులు
- ఐటీ, ఐటీ ఆధారిత సేవలు (50% సిబ్బందితో)
- గ్రామ పంచాయతీల స్థాయిలో ప్రభుత్వ ఆమోదం ఉన్న కామన్ సర్వీస్ సెంటర్లు
- కొరియర్ సేవలు
- జాతీయ రహదారుల వెంబడి దాబాలు (ప్యాకింగ్‌లో ఉన్న ఆహారాన్నే విక్రయించాలి)
- ట్రక్కుల మరమ్మతు దుకాణాలు
- ఎలక్ట్రీషియన్, ఐటీ రిపేర్లు, ప్లంబర్లు, మోటారు మెకానిక్‌లు, కార్పెంటర్ వంటి స్వయం ఉపాధి సేవలు
- పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల బయట గ్రామీణ ప్రాంతాల్లో నడిచే పరిశ్రమలు
- ఐటీ హార్డ్‌వేర్ తయారీ కేంద్రాలు
- షిఫ్టులవారీ పని విధానంలో, భౌతికదూర నిబంధనలతో జూట్ పరిశ్రమలు
- గ్రామీణ ప్రాంతాల్లో ఇటుక బట్టీలు
- గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, సాగునీటి ప్రాజెక్టులు, భవనాలు, అన్నిరకాల పారిశ్రామిక ప్రాజెక్టులు, ఎంఎస్‌ఎంఈ కార్యకలాపాలు. పారిశ్రామిక క్షేత్రాల్లోని అన్ని రకాల ప్రాజెక్టులు
- పునరుత్పాదక ఇంధన వనరుల ప్రాజెక్టుల నిర్మాణం
- నిర్మాణ స్థలంలో కార్మికులు అందుబాటులో ఉంటే పట్టణ ప్రాంతాల్లో ఆగిపోయిన నిర్మాణ పనుల కొనసాగింపు (బయటినుంచి కార్మికుల్ని తీసుకురాకూడదు)
- వైద్యపరమైన, పశువైద్యపరమైన, అత్యవసర వస్తువుల సేకరణ లాంటి సేవల కోసం ప్రైవేటు వాహనాలకు అనుమతి
- ప్రభుత్వ కాల్‌సెంటర్లు
- వ్యవసాయంలో వినియోగించే యంత్రసామగ్రి, విడిభాగాలు విక్రయించే దుకాణాలు
- ఔషధాలు, వైద్య పరికరాలు తయారు చేసే యూనిట్లు
లాక్‌డౌన్‌ను శాశ్వతంగా కొనసాగించలేం: జావ్‌డేకర్
కేంద్ర మంత్రి ప్రకాశ్ జావ్‌డేకర్ పీటీఐ వార్తాసంస్థతో మాట్లాడుతూ- లాక్‌డౌన్‌ను శాశ్వతంగా కొనసాగించలేమని స్పష్టం చేశారు. భారీ జనసంఖ్య ఉన్న దేశంలో ప్రస్తుత సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కోగలుగుతున్నామని, ఇదే కొనసాగితే మరికొన్ని ఉపశమన చర్యలు ఉంటాయని చెప్పారు. కాస్త ముందూవెనకగా నగరాల్లోనూ ఆర్థిక కార్యకలాపాలు మొదలవుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
- లోక్‌సభ, రాజ్యసభ సచివాలయాలు సోమవారం నుంచి పనిచేయనున్నాయి.
పరిశ్రమల్లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి
దేశవ్యాప్తంగా కరోనావైరస్ వ్యాప్తి ఉద్ధృతం(హాట్‌స్పాట్)గా లేని గ్రామీణ ప్రాంతాల్లో సోమవారం నుంచి ఆంక్షలకు లోబడి పనులు ప్రారంభించుకుంటున్న తరుణంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర హోం శాఖ సూచించింది. పనులు ప్రారంభమైనప్పటికీ లాక్‌డౌన్ అమల్లో ఉన్న ఈ కాలంలో ఎక్కడా మద్యం, గుట్కా, పొగాకు విక్రయాలు జరపకూడదని పేర్కొంది. ఈ మేరకు ఆదివారం కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.
బహిరంగ స్థలాల్లో ఏం చేయాలి?
- అన్ని బహిరంగ స్థలాలు, పనిచేసే చోట్ల ముఖానికి మాస్క్ వాడటం తప్పనిసరి.
- బహిరంగ స్థలాలు, పనిచేసే చోట్ల, రవాణా వ్యవస్థలను పర్యవేక్షించే అధికారులు తప్పనిసరిగా భౌతిక దూరాన్ని అమలు చేయాలి.
- సంస్థలు కానీ, బహిరంగ స్థలాల నిర్వాహకులు కానీ తమ పరిధిలో ఎక్కడా 5 మంది, అంతకంటే ఎక్కువ గుమికూడటానికి అనుమతివ్వకూడదు.
- వివాహాలు, అంత్యక్రియల్లో ఎక్కువమంది పాల్గొనకుండా జిల్లా కలెక్టర్లు నియంత్రించాలి.
- పనిచేసే చోట్ల..
- పనిచేసే అన్ని చోట్లా ప్రాంగణంలోకి వచ్చి, వెళ్లే ప్రతి ఒక్కరికి విధిగా థర్మల్ స్క్రీనింగ్ చేయాలి. వీలైనన్ని చోట్ల శానిటైజర్లను అందుబాటులో ఉంచాలి.
- భౌతికదూరం పాటించడానికి అనువుగా ప్రతి షిఫ్ట్ మధ్య ఒక గంట తేడా పాటించాలి. ఒక షిఫ్ట్ నడుస్తుండగానే ఇంకో షిఫ్ట్ ప్రారంభంకాకూడదు. భోజనాలకు, క్యాంటీన్లకు ఉద్యోగులు దశలవారీగా వెళ్లేలా చూడాలి.
- అనారోగ్య సమస్యలున్న 65 ఏళ్లకు పైబడిన వయోవృద్ధులు, అయిదేళ్లలోపు వయసుగల పిల్లలున్న తల్లిదండ్రులను ఇంటినుంచే పని చేసేలా ప్రోత్సహించాలి.
- పారిశ్రామిక ప్రాంగణంలోని అన్ని ప్రాంతాలనూ క్రిమిరహితంగా శుభ్రపరచాలి. వాష్‌రూమ్‌లు, టాయిలెట్లు, నీటి కొళాయిలు, అన్నిరకాల గోడలు, ఉపరితలాలను శుభ్రం (డిస్‌ఇన్‌ఫెక్ట్) చేయాలి.
- అన్ని ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు, ఉమ్మడి ప్రాంతాల్లో తాకకుండానే చేతులు శుభ్రం చేసుకొనే పరికరాలను అందుబాటులో ఉంచాలి.
- బయటినుంచి వచ్చే కార్మికులకు యజమానులే రవాణా సౌకర్యం కల్పించాలి. ఈ వాహనాలు కేవలం 30-40% సామర్థ్యంతోనే నడవాలి.
- పరిశ్రమ ప్రాంగణంలోకి వచ్చే ప్రతి వాహనాన్ని, యంత్రాలనూ ఇన్‌ఫెక్షన్ లేకుండా శుభ్రం చేయాలి.
- ఎక్కువమంది గుమికూడరాదు. మీటింగ్‌ల్లో, శిక్షణా కార్యక్రమాల్లో ప్రతి కుర్చీకి మధ్య ఆరు అడుగుల దూరం ఉంచాలి.
- ఉద్యోగులందరికీ వైద్య బీమా తప్పనిసరి.
- లిఫ్ట్‌లో ఇద్దరికి మించి అనుమతివ్వకూడదు. సాధ్యమైనంత మేర మెట్ల ద్వారా రాకపోకలు సాగించడాన్ని ప్రోత్సహించాలి.
- ఫ్యాక్టరీల ప్రాంగణాల్లో గుట్కా, పొగాకు వినియోగాన్ని నిషేధించాలి.
ససేమిరా అంటున్న రాష్ట్రాలు