లా కోర్సుల్లో చేరడానికి వయో పరిమితిని విధిస్తూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఓ వృద్ధురాలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయిదేళ్ల లా కోర్సులో చేరడానికి గరిష్ఠ వయసుగా 20 ఏళ్లు మూడేళ్ల ఎల్ఎల్బీకి 30 ఏళ్ల గరిష్ఠ వయసుగా బీసీఐ నిర్ణయించింది. తనకు చదవాలని ఆసక్తి ఉన్నా, గరిష్ఠ వయోపరిమితి దాటిందంటూ అవకాశం ఇవ్వడం లేదని ఉత్తర్‌ప్రదేశ్‌లోని సాహిబాబాద్కు చెందిన రాజకుమారి త్యాగి(77) వ్యాజ్యంలో పేర్కొన్నారు.
'77 ఏళ్ల వయసులో లా ఎందుకు చదవకూడదు?' - లా కోర్సుపై సుప్రీంకోర్టులో మహిళ వ్యాజ్యం
లా కోర్సులో చేరడానికి వయో పరిమితిని విధించడాన్ని ఓ వృద్ధురాలు సవాల్ చేశారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీసుకున్న వయోపరిమితి నిబంధనను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లా కోర్సుల్లో చేరడం తన ప్రాథమిక హక్కుగా గుర్తించాలని కోర్టును కోరారు.
తన భర్త చనిపోయిన తరువాత ఒంటరిగా ఆస్తులను కాపాడుకోవడానికి చట్టాలను చదివానని తెలిపారు త్యాగి. ప్రస్తుతం న్యాయవాది సహకారం లేకుండానే అన్ని రకాల వ్యవహారాలను చూసుకోగలుగుతున్నానని చెప్పారు. ఈ కారణంగానే లా చదవాలన్న ఆసక్తి కలిగిందని పేర్కొన్నారు. అయితేతనకు లా కోర్సుల్లో ప్రవేశానికి అర్హత లేకుండా చేశారని అన్నారు. ఇది రాజ్యాంగంలోని 14వ అధికరణం (చట్టం ముందు సమానత్వం), 19 (1)(జి)వ అధికరణం (నచ్చిన వృత్తి, వ్యాపారాన్ని చేసుకోవడం), 21వ అధికరణం(వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ), ఇతర నిబంధనలకు వ్యతిరేకమని తెలిపారు. లా కోర్సుల్లో చేరడం తన ప్రాథమిక హక్కుగా గుర్తించాలని కోర్టును కోరారు. జీవించే హక్కును రాజ్యాంగం ప్రసాదించిందని, దీని అర్థం కేవలం బతకడమేకాదని గౌరవప్రదంగా విద్య నేర్చుకోవడం కూడా అని వ్యాజ్యంలో వివరించారు.