ఉగ్రముప్పు పొంచి ఉందన్న అంచనాల నేపథ్యంలో శ్రీనగర్లో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు అధికారులు. నగరం చుట్టూ నూతన బంకర్లను ఏర్పాటు చేశారు. సైన్యం క్యాంపులు, మిలిటరీ స్టేషన్లు సహా అన్ని చోట్లా భద్రతను పెంచినట్లు అధికారులు వెల్లడించారు. ఆసుపత్రులు, పోలీస్స్టేషన్లు సహా..గతంలో ముష్కరులు రెండుసార్లు దాడి చేసేందుకు యత్నించిన శ్రీనగర్ విమానాశ్రయంలోనూ ముందు జాగ్రత్త చర్యగా భద్రత పెంచారు. ముఖ్యమైన స్థలాల్లో పలు అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు.
పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థలు దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా సంస్థలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా సమావేశాలు నిర్వహించిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
హై అలర్ట్...
సైనిక క్యాంపులు, మిలిటరీ స్టేషన్ల వద్ద హై అలెర్ట్ ప్రకటించారు. బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ క్యాంపుల వద్దా రక్షణను పెంచినట్లు ఆయా సంస్థల అధికారులు వెల్లడించారు.