మహారాష్ట్రలో క్యాంపు రాజకీయాలు ఊపందుకున్నాయి. ప్రభుత్వ ఏర్పాటును వ్యతిరేకిస్తోన్న కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన పార్టీలు తమ శాసనసభ్యులు చేజారిపోకుండా జాగ్రత్తలు చేపట్టాయి. పార్టీ ఎమ్మెల్యేలు ప్రలోభాల వలలో చిక్కుకోకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నాయి.
కాంగ్రెస్ తమ పార్టీ ఎమ్మెల్యేలను పశ్చిమ ముంబయిలోని మారియట్ హోటల్‌కు తరలించింది. బలనిరూపణ అయ్యేంత వరకు అధిష్ఠానం అనుమతి లేకుండా ఎవరినీ కలవకుండా ఆంక్షలు విధించింది. ఎన్సీపీ తమ ఎమ్మెల్యేలను రెనైసెన్స్ హోటల్లో ఉంచింది. శివసేన... ఎమ్మెల్యేలను అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలోని లలిత్ హోటల్‌కు తరలించింది.
భద్రత కట్టుదిట్టం...
కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన ఎమ్మెల్యేలు ఉన్న హోటళ్ల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు పోలీసులు. హోటల్‌కు వెళ్లే వాహనాలు, సిబ్బందితో సహా ప్రతి ఒక్కరిని క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. హోటళ్ల వద్ద కాపలా ఉండే ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్లను సైతం.. సరైన పత్రాలను చూపిస్తేనే అనుమతిస్తున్నారు.
రిసార్ట్‌లో పవార్, ఉద్ధవ్ భేటీ...
ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే.. ముంబయిలో ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఉన్న రిసార్ట్‌లో ఆదివారం భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ పరిణామాలు, భవిష్యత్తు కార్యచరణపై చర్చించారు. ఉద్ధవ్ ఠాక్రే వెంట ఆధిత్య ఠాక్రేతో పాటు సీనియర్ నేతలు ఉన్నారు.
ఇదీ చూడండి: లేఖల చుట్టూ 'మహా' రాజకీయం- సుప్రీం కీలక ఆదేశాలు