జమ్ములో144 సెక్షన్ ఎత్తివేత- యథాతథంగా కశ్మీర్ జమ్ముకశ్మీర్ పునర్విభజన, ఆర్టికల్ 370 రద్దు అనంతరం... జమ్మూలో జనజీవనం క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటోంది. ఈ నేపథ్యంలో సెక్షన్ 144ను ఎత్తేసి శనివారం నుంచి విద్యాసంస్థలను తెరవాల్సిందిగా జమ్మూ జిల్లా డిప్యూటీ మేజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు.
డోడా, కిశ్త్వాడ్ జిల్లాల్లో అమల్లో ఉన్న కర్ఫ్యూను శుక్రవారం ఎత్తివేశారు. కథువా, సంబా, ఉధమ్పుర్లో ఇప్పటికే విద్యాసంస్థలను తిరిగి ప్రారంభించారు.
కశ్మీర్ యథాతథమే...
జమ్ములో ప్రశాంత పరిస్థితుల నడుమ 144 సెక్షన్ ఎత్తివేసినా.. కశ్మీర్‌లో మాత్రం ఇందుకు ఇంకా సమయం పడుతుందని శాంతి భద్రతల అదనపు డీజీపీ మునీర్ ఖాన్ వెల్లడించారు. పుంఛ్, రాజౌరీ, రాంబన్ జిల్లాల్లో ఆంక్షలు కొనసాగనున్నాయని స్పష్టం చేశారు. నేడు మరికొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ నిబంధనలు సడలించనున్నట్లు తెలిపారు.
శుక్రవారం రోజు ప్రార్థనలు చేసుకొనేందుకు కశ్మీర్ లోయలో ప్రజలకు మసీదులకు వెళ్లేందుకు అనుమతినిచ్చినట్లు తెలిపారు. కశ్మీర్ ప్రజలను ఇబ్బందులకు గురి చేయకుండా పరిస్థితి చక్కదిద్దాలని జాతీయ భద్రత సలహాదారు అజిత్ డోభాల్ అధికారులకు సూచించారు.
భారీగా బలగాల మోహరింపు.. నేవీ అప్రమత్తం
స్వయం ప్రతిపత్తి రద్దు, రాష్ట్ర విభజన కారణంగా జమ్ముకశ్మీర్లో భారీ ఎత్తున బలగాలను మోహరించారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.
తీరం వెంట ఉగ్రవాదులు భారత భూభాగంలోకి చొరబడి దాడులు చేసే అవకాశముందన్న నిఘా వర్గాల హెచ్చరికతో నౌకా దళం అప్రమత్తమైంది. తీర ప్రాంత గస్తీని మరింత పెంచింది. రాడార్ల సాంకేతికత ద్వారా సముద్రంలో అనుమానాస్పద నౌకల కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు నౌకాదళ ఉన్నతాధికారులు వెల్లడించారు.
ఇదీ చూడండి:కలల కశ్మీరం నిర్మిద్దాం రండి: ప్రజలకు మోదీ పిలుపు