చైనాతో సరిహద్దులో ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో అమెరికాతో సంబంధాలు పటిష్ఠం చేసుకోవడానికి భారత్ అడుగులు వేస్తోంది. అందులో భాగంగా రెండు దేశాల మధ్య భౌగోళిక - ప్రాదేశిక సహకారం పెంపొందించుకునే దిశగా కసరత్తు చేస్తోంది. అందుకోసం అతి త్వరలోనే అమెరికాతో బేసిక్ ఎక్స్చేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్(బేకా)ను కుదుర్చుకోనుంది. అక్టోబరు చివర్లో దిల్లీలోనే బేకా ఒప్పందంపై భారత్ సంతకం చేయబోతోంది. దీని ద్వారా అమెరికా నుంచి ఎంక్యూ-9బీ లాంటి అత్యాధునిక డ్రోన్లను పొందడానికి వీలవుతుందని అధికార వర్గాలు తెలిపాయి.
బేకా ఒప్పందం కోసం భారత్- అమెరికా కీలక చర్చలు - భారత్ అమెరికా మంత్రుల భేటీ
అమెరికాతో భారత్ సంబంధాలు పటిష్టంగా ఉన్నాయి. వీటిని మరోస్థాయికి తీసుకువెళ్లేందుకు త్వరలోనే భారత్, అమెరికా రక్షణ, విదేశీ శాఖల మంత్రులు భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది.
"బేకా ఒప్పందంపై సంతకం చేయడానికి ముందుగా అక్టోబరు 6న భారత్, అమెరికా విదేశాంగ మంత్రులు జైశంకర్, మైక్ పాంపియో.. టోక్యోలో జరగనున్న క్వాడ్ భద్రతా చర్చల్లో పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత అమెరికా ఉప విదేశాంగ మంత్రి స్టీఫెన్ బేగన్ ఈ నెల మధ్యలో దిల్లీకి రాబోతున్నారు. అక్టోబరు చివర్లో దిల్లీలో జరిగే చర్చల్లో రెండు దేశాల విదేశాంగ మంత్రులతో పాటు భారత్, అమెరికా రక్షణ శాఖ మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, మార్క్ ఎస్పర్ కూడా పాల్గొంటారు. అయితే ఈ ఆఖరి సమావేశం తేదీ ఖరారు కావాల్సి ఉంది" అని ఓ అధికారి తెలిపారు.
ఈ ఆఖరి సమావేశం సమయంలోనే అమెరికా మంత్రులు భారత ప్రధాని నరేంద్ర మోదీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్‌లతోనూ భేటీ అవుతారని వెల్లడించారు.