భారత్‌తో 1954లో జరిగిన పంచశీల ఒప్పందం తర్వాత ఎన్నోసార్లు సరిహద్దు వివాదానికి తెరలేపిన చైనా.. 1975 తర్వాత రెండోసారి రక్తహోమానికి పాల్పడింది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని తులుంగే ప్రాంతంలో జరిగిన ఆనాటి ఘర్షణలో నలుగురు జవాన్లను పొట్టనపెట్టుకున్న చైనా.. 45 ఏళ్ల తర్వాత మళ్లీ అదే తరహా దాడికి పాల్పడింది. తాజా ఘటనలో ముగ్గురు సైనికులను బలిగొంది.
అమరవీరులది 16 బిహార్ రెజిమెంట్..?
చైనా సైనికులతో సోమవారం జరిగిన ఘర్షణలో మరణించిన వారిలో 16 బిహార్ రెజిమెంట్‌కు చెందిన సైనికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘర్షణలో కమాండింగ్ ఆఫీసర్ సహా ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. గాల్వన్ లోయలో ఒక ప్రదేశాన్ని వీడి వెళ్లేందుకు చైనా సైనికులు నిరాకరించిన సమయంలో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో జరిగిన ఘర్షణలో వీరు మృతి చెందినట్లు సమాచారం. చైనా వైపు కూడా ఐదుగురు సైనికులు మృతి చెందినట్లు సమాచారం. తమ సైనికులు మృతి చెందినట్లు ప్రకటన విడుదల చేసిన భారత సైన్యం.. కొద్ది సేపు ఆగి మరో ప్రకటన విడుదల చేసింది. దీనిలో చైనా వైపు కూడా ప్రాణనష్టం జరిగినట్లు పేర్కొంది. చైనా వైపు ఐదుగురు సైనికులు చనిపోయినట్లు గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. మరికొందరు గాయపడినట్లు సమాచారం.
గాల్వన్‌లోయ రోడ్డుపై చైనా అక్కసు..
1962లో భారత్-చైనా మధ్య యుద్ధం జరిగిన ప్రాంతాల్లో గాల్వన్ కూడా ఒకటి. గాల్వన్ లోయ వద్ద భారత్‌కు చెందిన బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఆధ్వరంలో డర్బుక్-ష్యంకు- దౌలత్‌బేగ్ ఓల్డీకి 255 కిలోమీటర్ల మేర రహదారిని నిర్మిస్తున్నారు. ఈ రహదారిపై ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా ప్రయాణించే వీలుంది. ఈ మార్గం నేరుగా దౌలత్‌బేగ్ ఓల్డీ విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో కలుస్తుంది. ఈ మార్గం పూర్తయితే మన బలగాలు కేవలం అరగంటలోపు గాల్వన్ లోయకు చేరుకుంటాయి. గతంలో ఈ పర్వత మార్గంలో దళాల రాకకు దాదాపు 8 గంటల సమయం పట్టేది. ఈ నేపథ్యంలో ఇక్కడ నిర్మిస్తున్న రోడ్డుపై చైనా అభ్యంతరం చెబుతోంది. ఈ విషయాన్ని నేరుగా చెప్పకుండా గాల్వన్ ప్రాంతంలోకి దళాలను చొప్పించి ఆ భూభాగం కూడా తనదే అని వాదిస్తోంది.
దౌలత్‌బేగ్ ఓల్డీ భారత్‌కు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన సియాచిన్‌కు సమీపంలోనే ఉంటుంది. ఇది అత్యంత ఎత్తులో ఉండటమే కాకుండా భారత్‌కు చైనా-పాక్ మధ్య ఉన్న కారాకోరం హైవేపై నిఘా వేయడానికి అత్యంత అనువుగా ఉంటుంది. దీంతోపాటు ఆక్సాయ్‌చిన్‌లో చైనా కదలికలను ఇక్కడి నుంచి కనిపెట్టవచ్చు. ఇది షిన్‌జియాంగ్-టిబెట్ రహదారికి కొంత దూరం సమాంతరంగా ఉంటుంది.
1962 చైనాతో యుద్ధం సందర్భంగా ఈ ఎయిర్ స్ట్రిప్‌ను నిర్మించారు. ఆ తర్వాత దీనిని 2008 వరకు పట్టించుకోలేదు. ఆ తర్వాత వాయుసేన ఎల్‌ఏసీ వెంట తన పలు ల్యాండింగ్ గ్రౌండ్స్‌ను ఆధునీకరించడంలో భాగంగా అభివృద్ధి చేసింది. 2013లో సీ130 గ్లోబ్ మాస్టర్‌ను ఇక్కడ ల్యాండ్ చేసి రికార్డు సృష్టించింది. సరిహద్దులకు నిత్యావసరాలు సరఫరా చేసే హెలీకాప్టర్లు ఇక్కడి నుంచి ప్రయాణిస్తాయి.
కార్మికుల సంఖ్య పెంచగానే తాజా ఘటన..
భారత్ లద్దాక్‌లో రోడ్డు నిర్మాణం విషయంలో వెనుకడుగు వేయలేదు. ఉన్నత స్థాయి సైనిక అధికారుల మధ్య చర్చలు జరుగుతుండగానే భారత్ భూభాగంలో రహదారి నిర్మాణం కొనసాగిస్తోంది. తాజాగా సోమవారం ఝార్ఖండ్ నుంచి ఇక్కడకు 1,600 మంది కార్మికులను తరలించింది.