ఝార్ఖండ్ శాసనసభ ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. 20 అసెంబ్లీ స్థానాలకుగాను 260 మంది పోటీపడుతున్నారు. 47 లక్షల మంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఝార్ఖండ్‌లోని మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు 5 దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.
రెండో దశలోని మొత్తం 20 స్థానాలకు గాను 18 నియోజకవర్గాల్లో పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి 3 గంటల వరకు జరగనుంది. జంషెడ్‌పుర్(తూర్పు), జంషెడ్‌పుర్ (పశ్చిమ) అసెంబ్లీ స్థానాల్లో సాయంత్రం 5 గంటల వరకు సాగుతుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
మొత్తం 6,066 పోలింగ్ కేంద్రాల్లో 949 (అత్యంత క్లిష్టమైనవి), నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లోని 762 (సున్నితమైనవి)గా ఎలక్షన్ కమిషన్ తెలిపింది. ఈ నేపథ్యంలో 42 వేల మంది పోలీసులతో పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేశారు.