రఫేల్ ఒప్పందంపై విచారణ అవసరం లేదని పేర్కొంటూ సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ సమర్పించింది. డిసెంబర్ 14న రఫేల్పై సుప్రీం ఇచ్చిన తీర్పులో ఎలాంటి పొరపాట్లు లేవని తెలిపింది. ఈ ప్రమాణపత్రంపై సోమవారం విచారణ జరగనుంది.
అసమగ్ర వివరాలతో కొన్ని వార్తాపత్రికలు ప్రచురించిన కథనాలను ఆధారంగా చేసుకుని సుప్రీం తీర్పును ఎలా ప్రశ్నిస్తారని పిటిషనర్లను కేంద్రం నిలదీసింది. పరిమితమైన అంశాలలో లోపాలుంటే మొత్తం విషయంపై సమీక్ష ఎందుకని ఆక్షేపించింది.
"మీడియా నివేదికల ఆధారంగా కోర్టులు తీర్పులు చెప్పలేవు. వాటిని చూపించి కోర్టు నిర్ణయాన్ని కూడా ప్రశ్నించలేం. ఎలాంటి అధికారిక ఆధారాలు లేని వ్యాజ్యాలతో సమీక్షను ఎలా నిర్వహిస్తారు. పూర్తి సమాచారం లేని అసమగ్ర పత్రాలు సమీక్షకు ఎలా సరిపోతాయి? అయినా ఒప్పందానికి సంబంధించిన అన్ని పత్రాలు 'కాగ్'కు అందుబాటులో ఉంచాం. యుద్ధ విమానాల కొనుగోలు ఖర్చు గతంతో పోలిస్తే 2.86 శాతం తక్కువేనని నివేదిక ఇచ్చారు. "
-కేంద్రం ప్రమాణ పత్రం సారాంశం