శబరిమల ఆలయం సహా ప్రార్థనాస్థలాల్లో మహిళలపై వివక్షకు సంబంధించిన అంశాలపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వాదనలు వినింది. అయితే శబరిమల కేసులో దాఖలైన రివ్యూ పిటిషన్లపై వాదనలు వినడం లేదన్న ధర్మాసనం.. ఐదుగురు సభ్యుల ధర్మాసనం సూచించిన అంశాలను మాత్రమే పరిశీలిస్తున్నట్లు తెలిపింది. గతేడాది నవంబర్ 14న అయిదుగురు సభ్యుల ధర్మాసనం శబరిమల ఆలయం, మసీదుల్లోకి మహిళల ప్రవేశం సహా వివిధ మతాలకు సంబంధించిన అంశాలను పునస్సమీక్షించాలని విస్తృత ధర్మాసనానికి సిఫార్సు చేసింది.
'శబరిమల 'రివ్యూ' పిటిషన్లను విచారించట్లేదు'
11:36 January 13
'రివ్యూ పిటిషన్లు కాదు.. సమస్యలనే పరిశీలిస్తున్నాం'
10:59 January 13
'శబరిమల రివ్యూ పిటిషన్లను విచారించట్లేదు'
శబరిమల కేసు రివ్యూ పిటిషన్లపై తాము వాదనలు వినడం లేదని తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన సుప్రీం ధర్మాసనం తెలిపింది. అయిదుగురు జడ్జ్‌ల బెంచ్ సూచించిన సమస్యలను పరిశీలిస్తున్నామని స్పష్టం చేసింది.
10:40 January 13
శబరిమల 'రివ్యూ' పిటిషన్లపై సుప్రీం విచారణ
శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలను అనుమతించే విషయమై దాఖలైన రివ్యూ పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతుంది. తొమ్మిది మంది సభ్యులతో కూడిన సుప్రీం ధర్మాసనం.. గతంలో ఇచ్చిన తీర్పుపై దాఖలైన 60 రివ్యూ పిటిషన్లను పరిశీలించనుంది.
జస్టిస్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎల్‌ఎన్ రావు, జస్టిస్ శాంతన గౌదర్, జస్టిస్ ఎస్‌ఏ నజీర్, జస్టిస్ ఆర్‌ఎస్ రెడ్డి, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌లు ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు. రివ్యూ పిటిషన్లు దాఖలు చేసిన వారికి జనవరి 6న నోటీసులు ఇచ్చింది ధర్మాసనం.
2018లో శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలకు అనుమతి ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆ తీర్పుపై ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ సహా పలువురు రివ్యూ పిటిషన్లు దాఖలు చేశారు.