జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ.. నిర్బంధం నుంచి విడుదలైన వెంటనే అధికరణ 370 రద్దుపై విరుచుకుపడ్డారు. జమ్ము కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేయడంపై కేంద్రంపై విమర్శలు గుప్పించారు ముఫ్తీ. ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందన్నారు. కేంద్రం 'బ్లాక్ డే' నాడు 'బ్లాక్ డెసిషన్' తీసుకుందని ఆమె ట్వీట్ చేశారు.
"14 నెలల తర్వాత నేను నిర్బంధం నుంచి విడుదలయ్యాను. 2019 ఆగస్టులో తీసుకున్న ఆ తప్పుడు నిర్ణయం ఇన్ని రోజులైనా నా గుండెలపై దాడి చేస్తూనే ఉంది. జమ్ముకశ్మీర్ ప్రజల పరిస్థితీ ఇలాగే ఉంటుందని భావిస్తున్నాను. ఆ రోజు జరిగిందాన్ని ఎవరూ మర్చిపోలేరు. మనం పోగొట్టుకున్నది తిరిగి తెచ్చుకోవాలి. కశ్మీర్ కోసం మన పోరాటాన్ని కొనసాగించాలి. అదంత సులభం కాదని నాకు తెలుసు."
- మెహబూబా ముఫ్తీ