కాంగ్రెస్ పార్టీకి జ్యోతిరాధిత్య సింధియా రాజీనామా చేయడం మధ్యప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. సింధియా 18 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు. అనేక పదవులు నిర్వహించారు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి సన్నిహితుడు. గతేడాది జరిగిన మధ్యప్రదేశ్ ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కీలకంగా వ్యవహరించారు. అలాంటి నాయకుడు దూరం కావడం కాంగ్రెస్కు పెద్ద దెబ్బే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అసంతృప్తులు చాలానే...
కాంగ్రెస్లో ఇంతగా వెలుగొందిన సింధియా రాజీనామా వెనుక చాలా అంశాలే ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మధ్యప్రదేశ్లో పార్టీ కార్యకలాపాల్లో ప్రాధాన్యం ఇవ్వకపోవటం పట్ల కాంగ్రెస్ అధిష్ఠానంపై సింధియా వర్గం ఎమ్మెల్యేలు చాలా రోజుల నుంచి అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.
సీఎం పదవి..
2018నాటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచార బాధ్యతలు భుజానికెత్తుకుని పార్టీకి అధికారాన్ని కట్టబెట్టిన సింధియాకు ముఖ్యమంత్రి పదవి దక్కలేదు. అప్పటి నుంచి పార్టీపై గుర్రుగా ఉన్న ఆయన పలుసార్లు బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.