మధ్యప్రదేశ్‌లో ఎన్నికలంటే కొన్ని దశబ్దాలుగా సింధియాల హవా స్పష్టంగా కనిపిస్తుండేది. ముఖ్యంగా గ్వాలియర్ రాజవంశమైన సింధియాలకు ఆ ప్రాంతంలో గట్టి పట్టుంది. వారసత్వంగా రాజకీయాలను అందిపుచ్చుకున్న జ్యోతిరాదిత్య సింధియా.. రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు. దశాబ్దాలుగా కాంగ్రెస్‌తోనే అంటకాగిన వారి కుటుంబం.. జ్యోతిరాదిత్య నిర్ణయంతో తాజాగా భాజపావైపు మళ్లింది. తన వర్గంలోని ఎమ్మెల్యేలతో సహా బయటకు వచ్చేయటం వల్ల మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ కూలిపోవటం, భాజపా అధికారం చేజిక్కించుకోవటం, సింధియా రాజ్యసభకు వెళ్లటం చకచకా జరిగిపోయాయి.
కానీ ఇప్పుడు ఎంపీలో భాజపా అధికారం వశం చేసుకోవటంలో కీలకంగా వ్యవహరించిన సింధియా ఎక్కడా కనిపించటం లేదు. భాజపా రాష్ట్ర నేతలు ఆయనను కలుపుకుపోలేకపోతున్నారు. ప్రచారంలో దూరం పెడుతున్నారు.
ఉరుముకొస్తున్న ఉప ఎన్నికలు
ప్రస్తుతం ఉప ఎన్నికల్లో భాగంగా మధ్యప్రదేశ్‌లోని 28 స్థానాల్లో నవంబర్ 3న పోలింగ్ జరగనుంది. నవంబర్ 10న ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే ప్రచారంలో భాగంగా ర్యాలీలు, సభలు, సమావేశాలతో హోరెత్తిస్తున్నాయి పార్టీలు. అయితే, ఆ స్థానాల్లో భాజపాను తిరుగుబాటు నేతల బెడద వేదిస్తోంది. పోటీలో సింధియా అస్మదీయులే ఎక్కువగా ఉన్నారు. ఈ నేపథ్యంలో జ్యోతిరాదిత్య సింధియా.. క్రీయాశీలకంగా వ్యవహరించకపోవటం గ్వాలియర్-చంబల్ ప్రాంతంలో ఆయన రాజకీయ ఉనికికే సవాళ్లు విసురుతోంది.
సింధియాకు సవాలే !
ప్రచారంలో భాగంగా సింధియాకు భాజపా కీలక నేతలెవరూ మద్దతు ఇవ్వటం లేదు. తన మద్దతుదారులను గెలిపించుకోవటంలో సింధియా ఒంటరి వారయ్యారు. కేవలం ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్, కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాత్రమే ఆయనకు తోడ్పాటునందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన వర్గాన్ని గెలిపించుకోవటం సింధియాకు సవాలే.
28 శాసనసభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలు ప్రత్యేకంగా నిలవనున్నాయి. వీటిలో 16 స్థానాలు గ్వాలియర్-చంబల్ ప్రాంతంలోనే ఉన్నాయి. ఈ స్థానాలను గెలుచుకోవటం సింధియా నాయకత్వానికి పరీక్షే అంటున్నారు విశ్లేషకులు. కాంగ్రెస్‌ను వీడి భాజపా గూటికి చేరిన సింధియా వర్గాన్ని ప్రజలు ఎంతవరకూ ఆదరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
కానరాని మద్దతు
2018 ఎన్నికల్లో భాజపా సీనియర్ నేతలపై పోటీ చేసి కాంగ్రెస్ తరఫున విజయం సాధించిన అభ్యర్థులు.. ఇప్పుడు కాషాయం కండువాతో బరిలో నిలబడ్డారు. ఈ నేపథ్యంలో భాజపా నేతలు, కార్యకర్తల నుంచి వారికి మద్దతు కరవైంది. కొన్నిచోట్ల తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీలో నిలబడుతున్నారు భాజపా నాయకులు. తేరుకున్న పార్టీ నష్టనివారణ చర్యలు చేపట్టింది.
భాజపా ప్రతి ఎన్నిక తమకు కీలకమంటోంది. ఈ నేపథ్యంలోనే గెలుపే లక్ష్యంగా సింధియాతో కలిసి పనిచేయాలని పార్టీ నేతలను బుజ్జగిస్తోంది. మరోవైపు జ్యోతిరాదిత్య సింధియా తన అభ్యర్థులను భాజపా టికెట్‌పై గెలిపించి సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అందరినీ కులుపుకుని వెళ్లాల్సిన సింధియా.. ఒంటరైపోయారు. మరోవైపు కాంగ్రెస్ సైతం సింధియాల మద్దతు లేకపోయినా.. ఈ స్థానాలను గెలుచుకోవాలని ప్రయత్నిస్తోంది. తమ క్యాడర్ సింధియావైపు మొగ్గుచూపకుండా చూసుకుంటోంది. విజయంపై విశ్వాసం వ్యక్తం చేస్తోంది.