మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌లో మొన్నటి వరకు కీలకంగా ఉన్న జ్యోతిరాదిత్య సింధియా భాజపాలో చేరారు. దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కండువాకప్పి ఆయనను ఆహ్వానించారు అధ్యక్షుడు జేపీ నడ్డా.
భాజపాలో చేరిన అనంతరం కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు సింధియా. ఆ పార్టీలో పరిస్థితులు మారిపోయాయని చెప్పారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రజల హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు.
" కాంగ్రెస్‌లో గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. వాస్తవ పరిస్థితులను తెలుసుకునే పరిస్థితి లేదు. కొత్త ఆలోచనలను స్వీకరించి కొత్తవారికి అవకాశం కల్పించే వాతావరణం లేదు. నా సొంత రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లో 2018లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 18 నెలల్లోనే ప్రజల కలలు నీరుగారిపోయాయి. 10రోజుల్లో రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు. 18నెలలు గడిచినా చేయలేదు. యువతకు ఉపాధి కల్పన లేదు. కాంగ్రెస్ పాలన అవినీతిమయమైంది."
-జ్యోతిరాదిత్య సింధియా, భాజపా నేత.