తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇకపై అంతరిక్షంలోనూ ఆకుకూరలు లభ్యం..! - తెలుగు తాజా వార్తలు

ఇకపై అంతరిక్షంలోనూ కూరగాయలు, పండ్లు తినే వెసులుబాటు ఉంది. ఎలా అనుకుంటున్నారా? ఇటీవల రోదసిలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం చేసిన పరిశోధనలో ఓ పంటను పండించారు. అందులో భూమిపై పండే పంట తరహాలోనే పోషక విలువలు ఉన్నాయని శాస్త్రవేత్తలు తేల్చారు. ఇంతకీ ఆ విశేషాలేంటో తెలుసుకుందామా?

Scientists say the space can no longer be harvested and eaten
ఇకపై అంతరిక్షంలోనూ ఆకుకూరలు లభ్యం..!

By

Published : Mar 9, 2020, 8:58 AM IST

రోదసిలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో ప్రయోగాత్మకంగా సాగు చేసిన ఆకుకూర (లెటుస్‌)లో భూమి మీద పండించిన పంట తరహాలోనే పోషక విలువలు ఉన్నాయని శాస్త్రవేత్తలు తేల్చారు. దీంతో రోదసి యాత్రల్లో సురక్షితమైన, తాజా ఆహారాన్ని పండించుకోవడానికి వ్యోమగాములకు మార్గం సుగమమైందని వివరించారు.

పోషక విలువలు పుష్కలంగా...

రోదసిలో పండించిన ఈ రెడ్‌ రొమైన్‌ లెటుస్‌లో వ్యాధి కారక సూక్ష్మజీవులు లేవని, తినడానికి సురక్షితమైనదేనని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. గురుత్వాకర్షణ శక్తి తక్కువగా, రేడియోధార్మికత అధికంగా ఉన్న పరిస్థితుల్లో పండినప్పటికీ ఈ పంటలో పోషక విలువలు ఏమాత్రం తగ్గలేదని అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా)కు చెందిన క్రిస్టీనా ఖోదాడ్‌ చెప్పారు. సాధారణంగా వ్యోమగాములు.. భూమి నుంచి పంపే ప్రాసెస్డ్‌, ప్రీప్యాకేజ్డ్‌ ఆహారంపై ఆధారపడుతుంటారు. అయితే తాజా ఆహారం వల్ల వారికి అదనంగా పొటాషియంతోపాటు కె, బి1, సి విటమిన్లు, ప్రీ ప్యాకేజ్డ్‌ ఆహారంలో తక్కువగా ఉండే పోషకాలు లభిస్తాయి. 2024 నాటికి చంద్రుడి దక్షిణ ధ్రువం వద్దకు, ఆ తర్వాతి కాలంలో అంగారకుడి వద్దకు వ్యోమగాములను పంపేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో వ్యోమనౌకలోనే పంటలను పండించడం ప్రయోజనకారిగా ఉంటుందని శాస్త్రవేత్తలు వివరించారు.

తిన్నారు.. బాగానే ఉంది

2014 నుంచి 2016 మధ్య కాలంలో ఐఎస్‌ఎస్‌లో ఈ లెటుస్‌ను పండించారు. ‘వెజ్జీ’ అనే ప్రత్యేక చాంబర్లలో దీన్ని సాగు చేశారు. ఈ చాంబర్లలో ప్రత్యేక ఎల్‌ఈడీ దీపాలు, నీటి సరఫరా వ్యవస్థ ఉంటుంది. ఇందులో పండిన లెటుస్‌ను వ్యోమగాములు తిన్నారు. వారిలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తలేదని శాస్త్రవేత్తలు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details