దేశంలో కరోనా మహమ్మారి సంక్రమణపై కీలక విషయాలు వెల్లడించారు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శాస్త్రవేత్తలు. అధిక ఆదాయ దేశాలతో పోలిస్తే భారత్‌లో 40-69 ఏళ్ల మధ్య వయసు వారిలోనే కేసులు, మరణాలు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ తాజా పరిశోధన జర్నల్ సైన్స్‌లో ప్రచురితమైంది. రెండు రాష్ట్రాల్లోని వేల మంది కాంటాక్ట్ ట్రేసర్స్ నుంచి సేకరించిన సమాచారం మేరకు 5,75,071 మందిలో వ్యాధి సంక్రమణపై అంచనా వేశారు.
ఈ పరిశోధన.. భారీగా కేసులు నమోదైన తక్కువ, మధ్యాదాయ దేశాల్లో మహమ్మారి వ్యాప్తిపై పరిశీలన చేసేందుకు ఉపయోగపడుతుందన్నారు దిల్లీలోని సెంటర్ ఫర్ డిసీజ్ డైనమిక్స్, ఎకనామిక్స్, పాలసీకి చెందిన శాస్త్రవేత్త రమణన్ లక్ష్మీనారాయణ.
"భారత్‌లోని రెండు రాష్ట్రాల్లో కేసులు, మరణాలు యువతలోనే అధికంగా ఉన్నట్లు తేలింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో కాంటాక్ట్ ట్రేసింగ్ల కోసం వందలాది మంది ఆరోగ్య కార్యకర్తలు పాల్గొనటం వల్ల ఈ పరిశోధన సాధ్యమైంది. వ్యాధి వ్యాప్తి, మరణాలపై ఫలితాలు.. కొవిడ్-19 కట్టడికి అనుసరించాల్సిన విధానాన్ని తెలియజేసే అవకాశం ఉంది. ఇది భారత పరిశోధనల సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలుపుతుంది. "
- రామణన్ లక్ష్మీనారాయణ, శాస్త్రవేత్త