కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. రఫేల్ ఒప్పందం విషయంలో ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి 'చౌకీదార్ చోర్ హై' (కాపలాదారే దొంగ) అనడం, ఈ వ్యాఖ్యలను సుప్రీంకోర్టుకు తప్పుగా ఆపాదించిన అంశాలపై సుప్రీంకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. రఫేల్ పునఃసమీక్ష వ్యాజ్యాలపై నిర్ణయంతోపాటే ఈ అంశంపైనా సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వనుంది.
కోర్టుకు ఆపాదన
రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంపై గత ఏడాది డిసెంబర్ 14న ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్లను అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఏప్రిల్ 10న ఉత్తర్వలు ఇచ్చింది. అయితే ఈ తీర్పు 'కాపలాదారే దొంగ' అనే అంశాన్ని స్పష్టం చేస్తోందంటూ రాహుల్ వ్యాఖ్యానించారు.
కోర్టు ధిక్కరణ కేసు
సుప్రీంకోర్టు తీర్పునకు రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలను ఆపాదించారంటూ భాజపా ఎంపీ మీనాక్షి లేఖి కోర్టు ధిక్కరణ కేసు దాఖలు చేశారు. కోర్టు సైతం ఇదే విషయమై రాహుల్ గాంధీకి ఏప్రిల్ 23న నోటీసులు జారీ చేసింది.