చిదంబరం 'కస్టడీ' వ్యాజ్యంపై నేడు సుప్రీం విచారణ సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పును సవాలు చేస్తూ కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం దాఖలు చేసిన పిటిషన్ నేడు సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. ఆగస్టు 26 వరకు రిమాండ్ విధిస్తూ ట్రయల్ కోర్టు ఆగస్టు 22న ఇచ్చిన తీర్పును నేడు సర్వోన్నత న్యాయస్థానం పరిశీలించనుంది.
ఈ వ్యాజ్యాన్ని సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్ ఆర్ భానుమతి, ఏఎస్ బోపన్న నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తుంది.
సోమవారమే విచారణ జరగాల్సింది..
ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో గత బుధవారం అరెస్టయిన చిదంబరం ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్నారు. అయితే తన అరెస్టును సవాల్ చేస్తూ చిదంబరం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 23నే ఈ పిటిషన్ విచారణకు రాగా.. కస్టడీ వ్యవహారంపై ఇప్పుడు జోక్యం చేసుకోబోమని న్యాయస్థానం స్పష్టం చేసింది. విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
అయితే సోమవారం ఈ పిటిషన్ను పరిశీలించకపోవటాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు చిదంబరం తరఫు న్యాయవాది, కాంగ్రెస్ నేత కపిల్ సిబల్. ఇందుకు కోర్టు రిజిస్ట్రీకి భారత ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలు తప్పనిసరి అని తెలిపింది. సీజేఐ ఆదేశాల ప్రకారమే ధర్మాసనం ఏర్పాటు జరుగుతుందని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: ఐఎన్ఎక్స్ మీడియా: చిదంబరం సీబీఐ కస్టడీ పొడిగింపు