తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సుప్రీంకు చేరిన 'పౌర' సెగ.. 18న విచారణ - supreme latest news

పౌరసత్వ చట్టాన్ని సవాల్​ చేస్తూ కాంగ్రెస్, త్రిపుర మాజీ మహరాజు దాఖలు చేసిన పిటిషన్లపై ఈనెల 18న విచారణకు అంగీకరించింది సుప్రీంకోర్టు. దిల్లీ జామియా, అలీగఢ్​లోని ముస్లిం విశ్వవిద్యాలయాల్లో ఆందోళనలు, పోలీసుల చర్యలపై రేపు విచారణ చేపట్టనుంది. కాంగ్రెస్​ నేత జైరాం రమేశ్ దాఖలు చేసిన వ్యాజ్యంపైనా అదే రోజు విచారణ చేపట్టనుంది సర్వోన్నత న్యాయస్థానం.

citizenship Act
'పౌర' చట్టాన్ని సవాల్​ చేస్తూ సుప్రీంలో పిటిషన్లు

By

Published : Dec 16, 2019, 1:42 PM IST

Updated : Dec 16, 2019, 3:19 PM IST

సుప్రీంకు చేరిన 'పౌర' సెగ.. 18న విచారణ

దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోన్న పౌరసత్వ చట్టాన్ని సవాల్​ చేస్తూ కాంగ్రెస్, త్రిపుర మాజీ మహారాజు ప్రద్యోత్ కిషోర్ దేవ్ బర్మాన్ దాఖలు చేసిన పిటిషన్లపై ఈనెల 18న విచారణకు అంగీకరించింది సుప్రీంకోర్టు. పౌర చట్టాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్​ సీనియర్ నేత జైరాం రమేశ్ దాఖలు చేసిన వ్యక్తిగత వ్యాజ్యంపైనా అదేరోజు విచారణ చేపట్టనుంది సర్వోన్నత న్యాయస్థానం. సీజేఐ జస్టిస్ ఎస్​ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ జరపనుంది.

ఆందోళనలపై రేపే విచారణ

దిల్లీ జామియా మిలియా విశ్వవిద్యాలయం, ఉత్తర్‌ప్రదేశ్‌ అలీగఢ్‌లోని ముస్లిం విశ్వవిద్యాలయంలో ఆందోళనలు, పోలీసుల చర్యపై రేపు విచారణ చేపట్టేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. ప్రస్తుతం ఆందోళనలు చల్లారి పరిస్థితులు చక్కబడాలని కోరుకుంటున్నట్లు పేర్కొంది. మరోవైపు ఆందోళనల కారణంగా రెండు యూనివర్సిటీల వద్ద పోలీసు భద్రతను కట్టుదిట్టం చేశారు. సెలవులు కారణంగా విద్యార్థులు వర్సిటీలను ఖాళీచేసి, తమ ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు.

విశ్వవిద్యాలయాల్లో జరిగిన ఆందోళనలు, పోలీసుల చర్య అంశాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు సీనియర్‌ న్యాయవాదులు ఇందిరా జైసింగ్, అభిషేక్‌ మను సింఘ్వి. అత్యవసర విచారణ చేపట్టాలని కోరారు. యూనివర్సిటీల్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, సుమోటోగా స్వీకరించాలని సుప్రీంను అభ్యర్థించారు. అందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బోబ్డే నిరాకరించారు. ఇలాంటి పరిస్థితుల్లో కలుగజేసుకోలేమని, శాంతిని మాత్రమే కోరుకుంటున్నామని పేర్కొన్నారు. ఇంకా ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయన్న కోర్టు.. పరిస్థితులు అదుపులోకి రాకుండా మధ్యలో కలుగజేసుకోలేమని స్పష్టం చేసింది. ప్రజా ఆస్తుల ధ్వంసం, హింస ఆగిపోతే కేసును మంగళవారం విచారణకు స్వీకరిస్తామని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.

ఇదీ చూడండి: రాహుల్ 'రేప్ ఇన్ ఇండియా' వ్యాఖ్యలపై ఈసీ ఆరా

Last Updated : Dec 16, 2019, 3:19 PM IST

ABOUT THE AUTHOR

...view details