తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ట్రాక్టర్​ ర్యాలీలో హింసపై నేడు సుప్రీం విచారణ - farmers protest on farm laws

గణతంత్ర దినోత్సవం రోజు రైతుల ట్రాక్టర్​ ర్యాలీలో చెలరేగిన హింసపై సుప్రీం కోర్టు బుధవారం విచారణ జరపనుంది. వేల మంది ఆందోళనకారులు బారికేడ్లు బద్దలుకొట్టి, పోలీసులపై దాడి చేసి ఎర్రకోటలో మతజెండా ఎగురవేశారు. వీటిపై వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి.

ట్రాక్టర్​ ర్యాలీలో హింసపై నేడు సుప్రీం విచారణ

By

Published : Feb 3, 2021, 5:45 AM IST

రైతులు దిల్లీలో చేపట్టిన ట్రాక్టర్​ ర్యాలీలో చెలరేగిన హింసపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు నేడు విచారణ చేపట్టనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్​ఏ బోబ్డే, న్యాయమూర్తులు జస్టిస్​ ఏఎస్​ బోపన్న, జస్టిస్​ వి. రామసుబ్రమణ్యన్​లతో కూడిన ధర్మాసనం ఈ విచారణ జరపుతుంది.

మూడు కొత్త వ్యవసాయ చట్టాల రద్దుకు ఉద్యమిస్తున్న రైతులు జనవరి 26న నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో విధ్వంసం చోటుచేసుకుంది. వేల మంది ఆందోళనకారులు బారికేడ్లను బద్దలు కొట్టి, పోలీసులపై దాడి చేసి, ఎర్రకోటలో మత జెండాను ఎగురవేశారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ ఘటనపై దర్యాప్తునకు సర్వోన్నత న్యాయస్థానం.. విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఒక కమిషన్​ను ఏర్పాటు చేయాలంటూ న్యాయవాది విశాల్ తివారి వేసిన పిటిషన్ కూడా వీటిలో ఉంది. సదరు కమిషన్​లో హైకోర్టు మాజీ న్యాయమూర్తులు ఇద్దరు ఉండాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. ర్యాలీలో జాతీయ జెండాను అవమానించిన వ్యక్తులు, సంస్థలపై ఎఫ్​ఐఆర్​లు నమోదు చేసేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని కోరారు.

ఆ ఘటన వల్ల సాధారణ జనజీవనంపై ప్రభావం పడిందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటర్నెట్​ సేవలు నిలిచిపోయాయని చెప్పారు. ''రెండు నెలలుగా శాంతియుతంగా సాగుతున్న నిరసన అకస్మాత్తుగా జనవరి 26న హింసాత్మకంగా మారింది. ఈ అలజడికి కారకులెవరన్నది గుర్తించడం జాతీయ భద్రత, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అవసరం.'' అని చెప్పారు.

కొన్ని సంస్థల కుట్ర వల్ల కూడా ఇది జరిగి ఉండొచ్చన్నారు. మరోవైపు ఎలాంటి ఆధారాలు లేకుండా రైతులను ఉగ్రవాదులుగా ముద్ర వేయకుండా అధికారులు మీడియాకు ఆదేశాలివ్వాలంటూ మనోహర్​లాల్​ శర్మ అనే మరో న్యాయవాది పిటిషన్​ వేశారు.

నిబంధనల ప్రకారం చర్యలు: హైకోర్టు

ట్రాక్టర్​ ర్యాలీలో జరిగిన హింసపై నమోదైన ఎఫ్​ఐఆర్​ల విషయంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని, పోలీసులను దిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఆందోళనల సమయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తులను తక్షణం విడుదల చేయాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని కొట్టేసింది.

ఇది ప్రచారం కోసం వేసిన 'పబ్లిసిటీ' ఇంట్రెస్ట్​ లిటిగేషన్​లా ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ ఘటనపై దిల్లీ పోలీసులు 44 ఎఫ్​ఐఆర్​లు దాఖలు చేశారని, 120 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వచ్చాయని పిటిషనర్​ వాదించారు. అరెస్టు మెమోలపై సంతకాలు చేయకపోవడం, బంధువులకు తెలియజేయకపోవడం, నిందితులను మేజిస్ట్రేట్​ ఎదుట హాజరుపరచకపోవడం.. అక్రమ నిర్బంధం కిందకే వస్తాయన్నారు.

ఇదీ చూడండి:గోడలు కాదు.. వంతెనలు నిర్మించండి: రాహుల్​

ABOUT THE AUTHOR

...view details