తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ చట్టం పరిధిలోకి విద్యా సంస్థలు? సుప్రీం పరిశీలన - educational institution or university consumer protection law

విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు వినియోగదారుల రక్షణ చట్టం పరిధిలోకి వస్తాయా అనే అంశాన్ని సుప్రీంకోర్టు పరిశీలించనుంది. న్యాయస్థానానికి ఈ అంశంలో భిన్న అభిప్రాయాలు ఉన్నాయని సుప్రీం పేర్కొంది. ఈ మేరకు వైద్య విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్​ను స్వీకరించింది.

SC to examine if educational institutions, varsities fall under consumer law
ఆ చట్టం పరిధిలోకి విద్యా సంస్థలు? సుప్రీం పరిశీలన

By

Published : Oct 21, 2020, 4:01 PM IST

దేశంలోని విద్యా సంస్థలు, యూనివర్సిటీలు వినియోగదారుల రక్షణ చట్టం పరిధిలోకి వస్తాయా లేదా అనే అంశాన్ని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ధర్మాసనానికి ఈ విషయంలో విభిన్న అభిప్రాయాలు ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది.

తమిళనాడు సేలంలోని వినాయక మిషన్ యూనివర్సిటీ సేవల్లో లోపాలున్నాయంటూ మను సోలంకీ, ఇతర వైద్య విద్యార్తులు దాఖలు చేసిన పిటిషన్​ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీలతో కూడిన ధర్మాసనం దీనిపై వాదనలు ఆలకించింది.

"విద్యాసంస్థ లేదా యూనివర్సిటీ.. వినియోగదారుల రక్షణ చట్టం 1986లోని నిబంధనలకు లోబడి ఉంటుందా అనే విషయంపై న్యాయస్థానానికి విభిన్న అభిప్రాయాలు ఉన్నందున.. అప్పీలును అనుమతించడం అవసరం. పిటిషన్​ను స్వీకరిస్తున్నాం."

-అక్టోబర్ 15న విచారణలో సుప్రీంకోర్టు

జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్(ఎన్​సీడీఆర్​సీ) నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలైన అప్పీలుపై ఆరు వారాల్లోగా స్పందన తెలియజేయాలని విశ్వవిద్యాలయం తరపున హాజరైన న్యాయవాది సౌమ్యజిత్​ను కోర్టు ఆదేశించింది.

విద్యాసంస్థల సంబంధిత కేసుల్లో సుప్రీంకోర్టు పలు తీర్పులు వెలువరించింది. విద్య అనేది వస్తువు కాదని, విద్యా సంస్థలు సేవలను అందించవని మహర్షి దయానంద్ యూనివర్సిటీ, పీటీ కోషి కేసులో తీర్మానించింది. ప్రవేశాలు, ఫీజుల విషయంలో సేవల ప్రస్తావన ఉండదని పేర్కొంది. కాబట్టి సేవల లోపం పేరిట వినియోగదారుల ఫోరం/ కమిషన్​లలో వాదనలకు ఆస్కారం లేదని తెలిపింది. ప్రస్తుతం వినాయక మిషన్ విశ్వవిద్యాలయం సైతం ఈ తీర్పులపై ఆధారపడింది.

అయితే విద్యార్థులు మాత్రం సుప్రీంకోర్టు ఇచ్చిన ఇతర తీర్పులను గుర్తు చేస్తున్నారు. విద్యా సంస్థలు వినియోగదారుల రక్షణ చట్టం పరిధిలోకి వస్తాయని పేర్కొన్న తీర్పులను ఉదహరించారు.

ఇదీ విద్యార్థుల వివాదం..

యూనివర్సిటీకి అన్ని అనుమతులు ఉన్నాయంటూ తప్పుడు హామీతో అధికారులు తమకు అడ్మిషన్ కల్పించారని పిటిషనర్లు ఆరోపించారు. ఆఫ్​షోర్(కోర్సులో కొంత భాగం విదేశాల్లో పూర్తిచేయడం) విద్యా కార్యక్రమంలో భాగంగా 2005-06లో ఇక్కడ అడ్మిషన్ తీసుకున్నట్లు చెప్పారు. భారత ప్రభుత్వం, భారత మెడికల్ కౌన్సిల్ గుర్తింపు ఉన్న ఎంబీబీఎస్ డిగ్రీ ఇప్పిస్తామని అధికారులు మాటిచ్చారని పేర్కొన్నారు. థాయ్​లాండ్​లో రెండేళ్ల కోర్సు పూర్తి చేసుకున్న తర్వాత మాట మార్చారని, విదేశీ విద్యార్థుల మాదిరిగానే ఇండియాలో స్క్రీనింగ్ పరీక్షలకు హాజరుకావాలని సూచించారని తెలిపారు. దీనిపై ఎన్​సీడీఆర్​సీ​లో ఫిర్యాదు చేయగా.. వినియోదారుల రక్షణ చట్టం పరిధిలోకి రాదని తమకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు.

సేవల లోపంతో పాటు విద్యా సంవత్సరాలు నష్టపోయామని, వృత్తిపరమైన అవకాశాలు కోల్పోయి మానసిక శారీరక వేదన అనుభవించామని పిటిషనర్లు పేర్కొన్నారు. ఒక్కొక్కరికి రూ.1.4 కోట్ల చొప్పున పరిహారం అందించాలని సోలంకీ సహా 8 మంది విద్యార్థులు ధర్మాసనాన్ని అభ్యర్థించారు.

ABOUT THE AUTHOR

...view details