సుప్రీంకోర్టులో కేసుల భౌతిక విచారణను ప్రారంభించాలని న్యాయస్థానం నిర్ణయించింది. ఈ మేరకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ)ని విడుదల చేసింది. అయితే, పరిమిత సంఖ్యలో కేసుల విచారణను ప్రారంభిస్తామని చెప్పినా.. కచ్చితమైన తేదీని ఎస్ఓపీలో పేర్కొనలేదు.
కరోనా నేపథ్యంలో మార్చి 25 నుంచి దృశ్యమాధ్యమం ద్వారానే విచారణ చేపడుతోంది అత్యున్నత న్యాయస్థానం.
సీజేఐకి కమిటీ సిఫార్సులు..
అయితే, భౌతిక విచారణను తిరిగి ప్రారంభించాలని ఈ నెల మొదట్లో వివిధ బార్ అసోసియేషన్లు అభ్యర్థించాయి. వీటిని జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల కమిటీ పరిగణనలోకి తీసుకుంది. అదనపు భద్రతా నిబంధనలతో ప్రయోగాత్మక ప్రాతిపదికన కేసుల భౌతిక విచారణను తిరిగి ప్రారంభించాలని సీజేఐ జస్టిస్ ఎస్ఏ బోబ్డేకు సిఫార్సు చేసింది.
ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన కార్యదర్శి సంజీవ్ కాల్గవాంకర్ ఎస్ఓపీ విడుదల చేశారు. తొలుత 3 కోర్టు రూముల్లో విచారణ ప్రారంభిస్తామని తెలిపారు. పరిస్థితులను బట్టి క్రమంగా విచారణలతో పాటు గదుల సంఖ్యనూ పెంచడమో, తగ్గించడమో చేస్తామని స్పష్టం చేశారు.
భౌతిక విచారణలకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను ఎస్ఓపీలో పేర్కొంది సుప్రీంకోర్టు పరిపాలన విభాగం.
- తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ప్రాక్సిమిటీ కార్డులు/ దీర్ఘకాలిక పాస్‌ల ద్వారా హై సెక్యూరిటీ జోన్‌లోకి ప్రవేశించడంపై నిషేధం ఉంటుంది.
- విచారణలకు హాజరయ్యే న్యాయవాదులు, కక్షిదారులు ప్రవేశం కోసం రోజువారీ ప్రత్యేక పాసులను రిజిస్ట్రీ జారీ చేస్తుంది.
- కోర్టు గదుల్లో భౌతిక దూరం నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. ఇందుకోసం తగిన ఏర్పాట్లు కోర్టు చేస్తుంది.
- కోర్టు లోనికి వెళ్లేందుకు, బయటికి వచ్చేందుకు ప్రత్యేక మార్గాలను కేటాయిస్తారు. ఎంట్రీ గేట్లలో థర్మల్ స్కానర్లు ఏర్పాటు చేస్తారు.
ఇదీ చూడండి:భూషణ్ కేసు: రూపాయి జరిమానా లేదా మూణ్నెల్లు జైలు