యోగి ఆదిత్యనాథ్, మాయావతి ఎన్నికల ప్రచారంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు స్పందించింది. వీరిపై ఏం చర్యలు తీసుకున్నారో మంగళవారం చెప్పాలంటూ ఎన్నికల సంఘం ప్రతినిధికి సమన్లు జారీచేసింది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీఎస్పీ అధినేత్రి మాయవతి విద్వేష ప్రసంగాలు చేశారన్న ఆరోపణల్ని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. వారిద్దరిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఇందుకోసం ఈసీ ప్రతినిధి ఒకరు మంగళవారం కోర్టులో హాజరుకావాలని సమన్లు జారీచేసింది.
ఎన్నికల ప్రచారంలో మతతత్వ ప్రసంగాలు చేస్తూ నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ యూఏఈ వాసి పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం ముందు వాదనలు జరిగాయి.