గణతంత్ర దినోత్సవం రోజు దిల్లీలో రైతుల ట్రాక్టర్ల ర్యాలీ సందర్భంగా ప్రజలను తప్పుదారి పట్టించేలా ట్వీట్లు చేశారంటూ పలువురు ప్రముఖులపై దాఖలైన కేసుల్లో వారిని అరెస్టు చేయకుండా సుప్రీంకోర్టు స్టే విధించింది. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ సహా ఆరుగురు పాత్రికేయుల అరెస్టుపై స్టే విధిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. థరూర్, రాజ్‌దీప్, మిగతా జర్నలిస్టులు దాఖలు చేసిన పిటిషన్లపై వివరణ ఇవ్వాలని కేంద్రం సహా ఇతరులకు నోటీసులు జారీచేసింది.
పిటిషనర్లపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని వారి తరఫున వాదనలు వినిపించారు కపిల్ సిబల్. ఈ అభ్యర్థనను మన్నించిన సుప్రీంకోర్టు.. రెండువారాల పాటు అరెస్టు చేయరాదని స్పష్టం చేసింది. ఆ తర్వాత అందరి వాదనలు విని తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.