బాబ్రీ మసీదు కేసు విచారణను సెప్టెంబర్ 30 నాటికి పూర్తి చేసి తీర్పు వెలువరించాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి మరింత సమయం కావాలని కోరిన నేపథ్యంలో ఆగస్టు 31తో ముగియనున్న గడువును సర్వోన్నత న్యాయస్థానం మరో నెల రోజుల పాటు పొడిగించింది. ఈ మేరకు జస్టిస్ రొహింటన్ నారీమన్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలిచ్చింది.
మూడోసారి..
1992 బాబ్రీ మసీదు కేసులో భాజపా అగ్రనేతలు ఎల్‌కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో రెండేళ్లలో విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని 2017లో సుప్రీం కోర్టు ఆదేశించింది. 2019 జులైలో ఆ గడువును మరో 9 నెలలు, ఈ ఏడాది మేలో మరో మూడు నెలల(ఆగస్టు 31) వరకు గడువును పొడిగించింది. అయితే మరోసారి గడువు పొడిగించాలంటూ తాజాగా ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి సురేంద్రకుమార్ యాదవ్ కోరిన నేపథ్యంలో ఈ సారి మరో నెల రోజులు గడువు పొడిగించింది.