విశ్వాస పరీక్ష వ్యాజ్యంపై మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై బుధవారం ఉదయం 10.30 గంటల లోపు సమాధానమివ్వాలని కమల్‌నాథ్ సర్కారును ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం మధ్యప్రదేశ్ ప్రభుత్వం, శాసనసభ కార్యదర్శి పేరిట నోటీసులు జారీ చేసింది.
రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై..
విచారణ సందర్భంగా రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాల అంశాన్ని ప్రస్తావించారు శివరాజ్‌సింగ్ చౌహన్ తరఫు న్యాయవాది. 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారని తెలిపారు. ఇప్పటికే ఆరుగురి రాజీనామాలు ఆమోదం పొందాయని.. మిగతా 16 మంది ఎమ్మెల్యేలు కూడా తమ రాజీనామాలు ఆమోదించాలని కోరుతున్నారని పేర్కొన్నారు.