దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించిన సందర్భంగా వలస కూలీలకు ప్రభుత్వమే వేతనాలు చెల్లించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు విచారించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపిన జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ దీపక్ గుప్తా ధర్మాసనం ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వ స్పందనను కోరింది. తదుపరి విచారణను ఏప్రిల్ 7కు వాయిదా వేసింది.
లాక్డౌన్ కారణంగా వలస కూలీలు, రోజు వారి కూలీలు, రిక్షా నడిపేవారు, చిన్న ఉద్యోగ కార్మికులు తినడానికి ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నారని... అలాంటి వారిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని పిటిషనర్లు కోరారు. అంతేకాకుండా వందలాది కూలీలు సొంతింటికి వెళ్లేందుకు బస్టాప్‌లు, రైల్వే స్టేషన్లు, రాష్ట్రాల సరిహద్దుల్లో తీవ్రప్రయత్నాలు చేస్తున్నారని.. తద్వారా వైరస్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని వాదించారు. అందుకే వలస కూలీలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని వ్యాజ్యంలో పేర్కొన్నారు.