కొవిడ్ కట్టడి కోసం మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి మార్గదర్శకాలు సహా ఆసుపత్రుల్లో అగ్నిమాపక నిబంధనల అమలుపై సమగ్ర వివరాలు అందజేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది సుప్రీంకోర్టు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో కొవిడ్ ఆసుపత్రిలో ఇటీవల అగ్నిప్రమాదం జరిగి పలువురు కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఈ ఆంశాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించింది ధర్మాసనం.
మూడు రోజుల్లో..
కొవిడ్ మార్గదర్శకాలు, అగ్నిమాపక నిబంధనలపై మూడు రోజుల్లో సమగ్ర అఫిడవిట్ సమర్పించాలని జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం.. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆసుపత్రుల్లో అగ్నిమాపక చర్యల అమలుపై నివేదిక అందించాలని రాష్ట్రాలకు సుప్రీం సూచించినట్లు తెలిపిన మెహతా... వారి నుంచి వివరాలు రాగానే సమగ్ర నివేదిక రూపొందిస్తామని వివరించారు.
కొవిడ్ బారిన పడ్డ రోగి ఇంటి బయట ఆ విషయాన్ని తెలియజెప్పేలా అధికారులు పోస్టర్‌లు అంటించరాదని సుప్రీంకోర్టు సూచించింది. విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం సంబంధిత అధికారులు సూచిస్తేనే ఆ పని చేయాలని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: 'కొవిడ్ రోగుల ఇళ్లపై పోస్టర్లు అంటించొద్దు'