దేశంలో కరోనాపై పోరుకు ప్రజలు, సంస్థలు అందిస్తున్న విరాళాలు.. "పీఎం కేర్స్"కి బదులు ఎన్డీఆర్ఎఫ్ నిధికి చేరాలని దాఖలైన పిల్‌పై స్పందించాలంటూ కేంద్రాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు విపత్తు నిర్వహణ చట్టం కింద ఓ జాతీయ ప్రణాళికను రూపొందించి, అమలు చేయడంపైనా స్పందించాలని స్పష్టం చేసింది.
'కరోనాపై పోరు కోసం జాతీయ ప్రణాళిక రూపొందిస్తారా?' - సుప్రీంకోర్టు కేంద్రం
పీఎం కేర్స్‌కు చేరుతున్న నిధులను ఎన్డీఆర్ఎఫ్ నిధికి తరలించాలని దాఖలైన పిల్‌పై స్పందించాలని కేంద్రాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు. అదే విధంగా కరోనాపై పోరు కోసం ఓ జాతీయ ప్రణాళికను రూపొందించి, అమలు చేయడంపైనా తన నిర్ణయాన్ని తెలపాలని స్పష్టం చేసింది. ఇందుకోసం కేంద్రానికి రెండువారాల గడువు విధించింది సర్వోన్నత న్యాయస్థానం.
!['కరోనాపై పోరు కోసం జాతీయ ప్రణాళిక రూపొందిస్తారా?' SC seeks Centre's response on plea for national plan to deal with COVID-19 pandemic](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7655955-366-7655955-1592396652562.jpg)
పీఎం కేర్స్లోని నిధులను ఇప్పటివరకు ఏ విధంగా ఉపయోగించారన్న విషయంపై కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదని పిల్ ఆరోపించింది. సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్(సీపీఐఎల్) అనే ఎన్జీఓ దాఖలు చేసిన ఈ పిటిషన్లో.. ఇప్పటివరకు అందిన నిధులను కూడా ఎన్డీఆర్ఎఫ్కు అందించే విధంగా ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంను కోరింది. కరోనా వైరస్, లాక్డౌన్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి అందించే సహాయంపై కేంద్రం కనీస ప్రమాణాలను నిర్దేశించాలని కూడా ఈ వ్యాజ్యం కోరింది.
ఈ మేరకు జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్.కే కౌల్, జస్టిస్ ఎమ్ ఆర్ షాతో కూడిన ధర్మాసనం.. రెండు వారాల్లోగా స్పందించాలని కేంద్రాన్ని ఆదేశించింది.