కొవిడ్-19 చికిత్సకు సంబంధించిన మార్గదర్శకాల్లో మార్పులకు ఆదేశించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలో జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ బి.ఆర్.గవాయ్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది.
'కరోనా కారణంగా కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంటోంది. అలాంటి వారికి మలేరియా నిరోధక ఔషధం హైడ్రాక్సీ క్లోరోక్విన్, యాంటీ బయాటిక్ ఔషధం అజిత్రోమైసిన్ ఇవ్వడం వల్ల తీవ్ర దుష్పరిణామాలు ఉంటాయని అమెరికన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ హెచ్చరించింది. వీటిని పరిగణనలోకి తీసుకుని భారత్‌లో కరోనా చికిత్సకు సంబంధించిన మార్గదర్శకాల్లో మార్పులు చేయాలి' అని అమెరికాలోని భారత సంతతి వైద్యుడు కునాల్ సహ పిటిషన్ వేశారు.
అత్యంత క్లిష్టపరిస్థితుల్లో ఐసీయూలో ఉన్న కొవిడ్-19 బాధితులకు హైడ్రాక్సీక్లోరోక్విన్, అజిత్రోమైసిన్‌లతో చికిత్స అందించవచ్చని ఆరోగ్యశాఖ పేర్కొందని ఆందోళన వ్యక్తం చేశారు. చికిత్స విషయమై సూచనలివ్వడానికి కోర్టుకు వైద్యపరమైన నైపుణ్యం ఉండదని ధర్మాసనం పేర్కొంది. పిటిషన్‌లో ప్రస్తావించిన అంశాలను భారత వైద్య పరిశోధన మండలి దృష్టికి తీసుకెళ్లాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆదేశించింది.