అనిశ్చితిలోనే మధ్యప్రదేశ్ సర్కార్-సుప్రీం కీలక వ్యాఖ్యలు మధ్యప్రదేశ్‌లో శాసనసభ్యత్వాలకు రాజీనామా చేసిన 16 మంది ఎమ్మెల్యేలను న్యాయమూర్తి ఛాంబర్‌లో హాజరుపర్చాలన్న భాజపా ప్రతిపాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. శాసనసభలో బలపరీక్ష నిర్వహించాలని మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహన్, ఎమ్మెల్యేల నిర్బంధానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్‌లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది.
ఎమ్మెల్యేలు శాసనసభకు హాజరైనా, కాకున్నా వారిని నిర్బంధించరాదని స్పష్టం చేసింది. శాసనసభలో ఎవరికి బలం ఉందన్న అంశం జోలికి తాము వెళ్లడం లేదన్న సుప్రీంకోర్టు... శాసనసభ్యులు సభకు స్వేచ్ఛగా వెళ్లేలా చూడాలని సూచించింది. తమ రిజిస్ట్రార్ జనరల్‌ను బెంగళూరులో ఉన్న ఎమ్మెల్యేల వద్దకు పంపేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
శాసనసభ్యులను బెంగళూరు నుంచి భోపాల్‌కు తరలించాలన్న కాంగ్రెస్ వినతిని... శివరాజ్ తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ ముకుల్ రోహత్గీ వ్యతిరేకించారు. భోపాల్ తరలిస్తే కాంగ్రెస్ బేరసారాలు జరపాలని భావిస్తోందని వివరించారు. రాజ్యాంగపరంగా ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని వారి తరపు న్యాయవాది వాదించారు. కాంగ్రెస్ నేతలను కలుసుకునేందుకు వారు ఇష్టపడడం లేదని తెలిపారు. దీనిపై తదుపరి విచారణను సుప్రీంకోర్టు గురువారానికి వాయిదా వేసింది.
నాటకీయ పరిస్థితులు
కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌పై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది భాజపా. రాజ్యసభ ఎన్నికల్లో తనకు ఓటేయాలని బెంగళూరులో ఉన్న 16 మంది ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించింది. అంతకుముందు బెంగళూరులో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మధ్యప్రదేశ్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఉన్న బెంగళూరులోని రమదా హోటల్ ముందు కాంగ్రెస్ నేత దిగ్విజయ్ ధర్నా చేపట్టారు. ఎమ్మెల్యేలను కలిసేందుకు ప్రయత్నించగా... పోలీసులు అనుమతి నిరాకరించారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడం వల్ల చివరకు ఆయనను అదుపులోకి తీసుకొని కాసేపటికి విడుదల చేశారు.
మరోవైపు దిగ్విజయ్ సింగ్‌ను కలిసే ఉద్దేశం తమకు లేదని కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు తేల్చి చెప్పారు. స్వచ్ఛందంగానే రిసార్టులో ఉంటున్నామని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ నిరసన
తిరుగుబాటు ఎమ్మెల్యేలను కలవకుండా దిగ్విజయ్ సింగ్‌ను అడ్డుకోవడాన్ని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ తప్పుబట్టింది. దిగ్విజయ్ సింగ్‌ను అదుపులోకి తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు మధ్యప్రదేశ్ భాజపా కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు పలువురిని నిర్బంధించారు. అయితే కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లు రువ్వినట్లు భాజపా నేతలు ఆరోపించారు.
ఇదీ చదవండి: 'ఆ వివరాలు సమర్పించకపోతే చర్యలు తప్పవు'