దేశ రాజధానిలో చెలరేగిన హింసాత్మక 'పౌర' అల్లర్ల బాధితులు దాఖలు చేసిన పిటిషన్లను ఈనెల 6న విచారించాలని దిల్లీ హైకోర్టును ఆదేశించింది సుప్రీంకోర్టు. ప్రజలను రెచ్చగొట్టేలా విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన రాజకీయ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు 10 మంది పిటిషనర్లు. వీరి వ్యాజ్యాలపై వాదనలు విన్న ధర్మాసనం.. సదరు వ్యాజ్యాలతో పాటు దిల్లీ అల్లర్లకు సంబంధించిన ఇతర పిటిషన్లను కూడా వీలైనంత వేగంగా విచారణ చేయాలని దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరింది.
అయితే కార్యకర్త 'హర్ష్ మందర్' విద్వేషపూరిత ప్రసంగాలు చేశారని ఆరోపణలు చేస్తూ దాఖలైన పిటిషన్లను మాత్రం తామే విచారిస్తామని తెలిపింది సర్వోన్నత న్యాయస్థానం.