సైన్యంలో మహిళలకు శాశ్వత కమిషన్ ఏర్పాటు, కమాండ్ హోదా కల్పించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వారి ప్రాధాన్యతను స్పష్టం చేస్తుందన్నారు సైన్యాధిపతి జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే. సైన్యంలో లింగబేధం లేకుండా చేసేందుకు సైన్యం ప్రయత్నిస్తోందని తెలిపారు.
మహిళలను ర్యాంకు స్థాయిలో చేర్చుకోవడానికి సైన్యం చొరవ తీసుకుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం 100 మంది మహిళా సైనికుల బృందం మిలిటరీ పోలీస్ సెంటర్లో శిక్షణ పొందుతోందన్నారు సైన్యాధిపతి.
"జాతి, లింగ ప్రాతిపాదికన సైన్యంలో వివక్ష ఉండదు. ఈ విషయంలో సైన్యం ఎప్పుడూ ముందుంటుంది. మహిళలను సీఎంపీ(కార్ప్స్ ఆఫ్ ఆర్మీ మిలటరీ)లో జవాను హోదాలో ఆర్మీనే మొదట నియమించింది. ఇదే విధంగా ఇక ముందు కూడా లింగ సమానత్వం కోసం ప్రయత్నిస్తూనే ఉంటాం."