దిల్లీలో రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు నిర్మించ తలపెట్టిన సెంట్రల్ విస్టాపై కీలక ఆదేశాలిచ్చింది సుప్రీం కోర్టు. ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ పెండింగ్‌లో ఉన్న వ్యాజ్యాలపై నిర్ణయం తీసుకునే వరకు ఎలాంటి నిర్మాణాలు, లేదా కూల్చివేతలు చేపట్టకూడదని స్పష్టం చేసింది. అయితే.. ఈ ప్రాజెక్టు కోసం అవసరమైన కాగితపు వర్క్, ప్రతిపాదిత గ్రౌండ్ బ్రేకింగ్ వేడుకలతో ముందుకుసాగొచ్చని చెప్పింది.
సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌పై దాఖలైన పలు వ్యాజ్యాలపై.. జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రాజెక్టు పట్ల కేంద్రం అనుసరిస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేసింది ధర్మాసనం. ఈ సందర్భంగా.. అత్యున్నత న్యాయస్థానం నిర్ణయం వెలువడే వరకు ప్రాజెక్టులో నిర్మాణాలు, కూల్చువేతల వంటివి చేపట్టబోమని ధర్మాసనానికి హామీ ఇచ్చారు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. ఆ క్రమంలో.. సెంట్రల్ విస్టా ప్రాజెస్ట్ శంకుస్థాపనకు అనుమతించింది న్యాయస్థానం.