మధుమేహం, క్యాన్సర్ తదితర వ్యాధులతోపాటు మానసిక సమస్యలు కూడా శరవేగంగా పెరిగిపోతున్నాయని నిపుణుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. ఒత్తిడి, తీవ్ర పోటీ, ఇతర కారణాల వల్ల 25 శాతం మంది మానసిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని వివరిస్తున్నారు. 50 శాతం మానసిక రోగాలు వంశపారంపర్యంగా వస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. ఇటీవలే మానసిక సమస్యల కారణంగా ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. తాజాగా బాలీవుడ్ యువహీరో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత మానసిక రుగ్మతలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మానసిక సమస్యలకు బీమా కల్పించాలంటూ దాఖలైన వ్యాజ్యంపై విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు.
సుప్రీం నోటీసులు..
వాదనలు విన్న అనంతరం.. మానసిక అస్వస్థతకూ బీమా భద్రతను కల్పించే అవకాశాలున్నాయా? అనే అంశంపై కేంద్ర ప్రభుత్వం, ఐఆర్‌డీఏకు నోటీసులు జారీ చేసింది. జస్టిస్ ఆర్ నారిమన్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం మంగళవారం వీడియా కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది. మానసిక సమస్యలకూ బీమా కవరేజ్‌ను ఎందుకు వర్తింపచేయరాదో బదులివ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది.