కోర్టు ధిక్కరణకు పాల్పడే విధంగా ట్వీట్లు చేసిన కేసులో న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌కు భారత్ అత్యున్నత న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది. భూషణ్‌కు ఒక్క రూపాయి జరిమానా విధిస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. సెప్టెంబర్ 15లోగా రూపాయిని కోర్టుకు డిపాజిట్ చేయాలని ఆదేశించింది.
డిపాజిట్ చేయకపోతే 3 నెలల జైలుశిక్ష, మూడేళ్లపాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయకుండా నిషేధం విధిస్తామని తీర్పులో హెచ్చరించింది.
న్యాయమూర్తులపై అవినీతికి సంబంధించి ఫిర్యాదులు చేసేందుకు అంతర్గత విధానం ఉందనే విషయాన్ని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులు చెబుతున్నాయని జస్టిస్ అరుణ్ మిశ్రా విచారణ సందర్భంలో అభిప్రాయపడ్డారు. భావప్రకటనా స్వేచ్ఛను గౌరవించాల్సిందేనని, అయితే ఇతర హక్కులను కూడా గౌరవించాలని ధర్మాసనం స్పష్టంచేసింది.
నాలుగు రోజుల సమయం..
సుప్రీంకోర్టు జడ్జిలు, కోర్టులపై భూషణ్ చేసిన ట్వీట్లను సుమోటోగా స్వీకరించి కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసింది. ఇప్పటికే ప్రశాంత్ భూషణ్‌ను దోషిగా తేలుస్తూ ఆగస్టు 14న సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకటించింది. ఆయనపై చర్యలకు అవకాశం కలిపిస్తూ క్షమాపణ చెప్పేందుకు నాలుగురోజుల సమయం ఇచ్చింది.
కానీ, ప్రశాంత్ భూషణ్ మాత్రం క్షమాపణ చెప్పేందుకు నిరాకరించారు. ఫలితంగా ఆగస్టు 25న తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు... సోమవారం శిక్ష ఖరారు చేసింది.
భూషణ్ ఏమన్నారంటే..
"నా ట్వీట్లు న్యాయస్థానాన్ని అగౌరవపరిచే ఉద్దేశంతో చేయలేదు. కానీ నా ఆవేదనను వ్యక్తపరిచేందుకు చేసినవి. వాటిని తప్పుగా భావించారు. ఇది భావప్రకటనా స్వేచ్ఛకు నీళ్లు వదిలేసిన క్షణం. అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడాలని చాలా మంది ప్రోత్సహించినట్లు అనిపిస్తోంది" అని తీర్పు అనంతరం ప్రశాంత్ భూషణ్ మాట్లాడారు.