అధికరణ 370 రద్దు, జమ్ముకశ్మీర్‌లో ఆంక్షలపై దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.
ఇల్తీజకు అనుమతి...
తన తల్లి ఆరోగ్యం సరిగా లేదని, చూడటానికి అనుమతివ్వాలంటూ జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తీజ ముఫ్తీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టింది ధర్మాసనం. శ్రీనగర్ వెళ్లి ముఫ్తీని కలిసేందుకు ఇల్తీజకు అనుమతించింది. శ్రీనగర్‌లోని ఇంటికి కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్లాలంటే స్థానిక అధికారుల అనుమతి తీసుకోవాలని ఆదేశించింది.
తరిగమిని తరలించాలని ఆదేశం..
జమ్ముకశ్మీర్ సీపీఎం నేత మహ్మద్ యూసుఫ్ తరిగమి ఆరోగ్యం క్షీణించిందని, దిల్లీ ఎయిమ్స్‌కు తరలించాలని ఆ పార్టీ అగ్రనేత సీతారాం ఏచూరి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టింది ధర్మాసనం. ఇటీవలే శ్రీనగర్‌కు వెళ్లి తరిగమిని కలిసి ఏచూరి... న్యాయస్థానానికి నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా తరిగమి ఆరోగ్యం ముఖ్యమని పేర్కొంది సుప్రీం. ఆయన్ను దిల్లీ ఎయిమ్స్‌కు తరలించాలని ఆదేశించింది. ఏచూరి నివేదికపై సమాధానమివ్వాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.