దిల్లీ రైల్వే పట్టాలను ఆనుకుని 140 కిలోమీటర్ల మేర ఉన్న 48 వేల మురికివాడ నివాసాలను తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు మూడు నెలల గడువునిచ్చింది. ఈ విషయంలో రాజకీయ పరంగా ఎవరూ జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేసింది.
మురికివాడల్లోని నివాసాల తొలగింపునకు అడ్డుకునే విధంగా ఏ కోర్టు కూడా స్టే విధించకూడదని తన తీర్పులో పేర్కొంది సర్వోన్నత న్యాయస్థానం. ఒకవేళ స్టే విధించినా.. అది పనిచేయదని తేల్చి చెప్పింది.
ఈపీసీఏ(పర్యావరణ కాలుష్య నిరోధక నియంత్రణ ప్రాధికార సంస్థ) దాఖలు చేసిన నివేదికను పరిశీలించిన అనంతరం ఈ మేరకు ఆదేశాలిచ్చింది జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కృష్ణ మురారి ధర్మాసనం. ఆ ప్రాంతంలోని వ్యర్థాలు, నివాసాలను తొలగించడంపై నెల రోజుల్లో నివేదికను సమర్పించాలని తెలిపింది.
మురికివాడల్లోని నివాసాల తొలగింపునకు అవసరమైన ఖర్చులో 70శాతం రైల్వే, మిగిలిన 30శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని సుప్రీంకోర్టు వెల్లడించింది. పనుల కోసం అవసరమైన మానవ వనరులను దక్షిణ దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(సీడీఎమ్సీ), రైల్వే, సంబంధిత సంస్థలు అందిస్తాయని పేర్కొంది.