పౌరసత్వ చట్టం రాజ్యాంగబద్ధతను పరిశీలించేందుకు అంగీకరించింది సుప్రీం కోర్టు. కానీ.. ఆ చట్టం అమలుపై స్టే విధించేందుకు నిరాకరించింది. పౌర చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది న్యాయస్థానం. ఇందుకు జనవరి రెండో వారం వరకు గడువు ఇచ్చింది.
ఐయూఎంఎల్, కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ సహా పలువురు దాఖలు చేసిన 59 పిటిషన్లపై.. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. సుదీర్ఘ వాదనల అనంతరం పౌర చట్టం అమలుపై స్టే విధించేందుకు నిరాకరించింది. తదుపరి విచారణను జనవరి 22కు వాయిదా వేసింది.
సీఏఏ అవగాహనపై..
పౌర చట్టం లక్ష్యం, అందులోని అంశాలపై ప్రజల్లో అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఉందనే అంశంపై న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ వాదనలు వినిపించేందుకు విన్నవించగా అందుకు అంగీకరించింది ధర్మాసనం. సాధారణ ప్రజలకు పౌర చట్టంపై అవగాహన కల్పించాలని ప్రభుత్వ తరఫున హాజరైన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌కు సూచించింది. అందుకోసం ఆడియో, వీడియో మాధ్యమాలను వినియోగించుకోవాలని తెలిపింది.
ధర్మాసనం సూచనల అమలుకు సుముఖత తెలిపారు వేణుగోపాల్. అత్యవసరమైన ఈ అంశాన్ని ప్రభుత్వం తప్పకుండా చేపడుతుందని తెలిపారు.